రాజకీయాల్లో ముక్కుసూటితనంతో పోయే నాయకులు చాలా అరుదుగానే ఉంటారు. తాము అనుకున్నది అనుకున్నట్లు కుండబద్దలుగొట్టినట్లు చెబుతారు.  ప్రత్యర్ధ పార్టీలైనా, సొంత పార్టీ అయినా సరే తప్పులు ఉంటే మాత్రం మొహమాటం లేకుండా చెప్పేస్తారు. ఇలా ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు చెప్పే నేతల్లో విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ముందు వరుసలో ఉంటారని చెప్పొచ్చు. ఈయన టీడీపీలో ఉన్న తన దారిలో తాను వెళుతూనే రాజకీయాలు చేస్తారు. అందుకే సొంత పార్టీ వాళ్లే కాదు, ఇతర పార్టీల వాళ్ళు కూడా నానిని ‘బెజవాడ బెబ్బులి’అని పిలుస్తారు.

 

2014లో విజయవాడ నుంచి తొలిసారి ఎంపీగా గెలిచిన నాని...పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటూనే, తాను అనుకున్నది కూడా మొహమాటం లేకుండా చెప్పేసేవారు. ఇక తన ట్రావెల్స్‌కు సంబంధించి ఏదో సమస్య వస్తే, టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పిన వినకుండా మొత్తం ట్రావెల్స్‌నే మూసేశారు. ఇక ఎంపీగా ఉంటూ తన నిధులని కేవలం టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకే ఖర్చు పెట్టకుండా, వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు కూడా ఇస్తూ తనకు అంతా ఒకటే అని చాటి చెప్పారు.

 

ఇక 2019లో మరోసారి టీడీపీ ఎంపీగా గెలిచిన నాని...సొంత పార్టీలోని తప్పులని ఏకీపారేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు భజన చేసే బుద్దా వెంకన్న, దేవినేని ఉమాలు లక్ష్యంగా ఘాటు విమర్శలే చేశారు. ఇలా సొంత పార్టీలో తప్పులు ఉంటే ఎత్తిచూపే నాని...అధికార వైసీపీపై కూడా అదే స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇక ఈ విధంగా ముందుకు పోతున్న నాని, తాజాగా ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌కు సంబంధించిన వ్యవహారంపై సెటైర్లు వేశారు.

 

గత చంద్రబాబు హయాంలో పని చేసిన ఏబీ, ప్రభుత్వానికి కాకుండా పార్టీకి ఇంటలిజెన్స్ పని చేశారని ఆరోపణలు వచ్చాయి. ఆయన గైడన్స్‌లోనే బాబు అభ్యర్ధులని ఎంపిక చేశారని, దాని వల్ల పార్టీకు ఫుల్ డ్యామేజ్ జరిగిందని తెలిసింది.  అయితే అదే విషయంపై నాని సెటైరికల్ స్పందించారు. “మీరు ముఖ్యమంత్రి అవ్వటానికి, మీ పార్టీ అధికారంలోకి రావడానికి, తెలుగుదేశం పార్టీ ఓడిపోవటానికి, ప్రధాన భూమిక పోషించిన వ్యక్తిని సన్మానిస్తారనుకుంటే సస్పెండ్ చేశారేంటి జగన్మోహన్ రెడ్డి గారూ” అంటూ వెటకారంగా ట్వీట్ చేశారు. అంటే ఏబీ చంద్రబాబుని తప్పుదోవ పట్టించి, పరోక్షంగా జగన్ గెలవడానికి కారణమయ్యారని చెప్పారు. మొత్తానికి ఇదంతా చూసుకుంటే ఈ బెజవాడ బెబ్బులి ముక్కుసూటితనానికి మారుపేరు అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: