ఉత్త‌రాంధ్ర అస్త్రంతో తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు ఇరకాటంలో ప‌డేస్తున్న ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని...స‌రిగ్గా అదే పాయింట్‌లో ఎదుర్కునేందుకు సైకిల్ పార్టీ అధ్య‌క్షుడు రెడీ అయ్యార‌ని స‌మాచారం. రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ ఎజెండాలో త‌న‌ను ఉత్త‌రాంధ్ర వ్య‌తిరేకిగా మార్చేందుకు సీఎం జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్న నేప‌థ్యంలో..అదే ప్రాంతానికి చెందిన టీడీపీ కీలక నేత కింజరాపు అచ్చెన్నాయుడుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను అప్పగించి...ఆయ‌న‌తో జ‌గ‌న్‌ను టార్గెట్ చేయించేందుకు చంద్రబాబు నిర్ణయించారని తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ జ‌గ‌న్‌కు క‌ష్ట‌కాల‌మేనని అంటున్నారు. 

 

గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా జగన్ గాలి వీయ‌డం...టీడీపీ ఘోర ప‌రాజ‌యం పాల‌వ‌డం తెలిసిన సంగ‌తే. కోలుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న త‌రుణంలోనే...మూడు రాజ‌ధానుల అంశం సీఎం జ‌గ‌న్ తెర‌మీద‌కు తెచ్చారు. ఇది ఉత్త‌రాంధ్ర‌లో చంద్ర‌బాబుకు మైన‌స్‌గా మారిందనేది కాద‌న‌లేని నిజం. ఉత్త‌రాంధ్ర అభివృద్ధి నిరోధ‌కుడిగా బాబుకు ముద్ర ప‌డిపోయింది. ఇదే స‌మ‌యంలో ఇప్ప‌టికే జ‌గ‌న్ అక్క‌డ పాతుకుపోయారు. ఉత్త‌రాంధ్ర‌లో దాదాపు 95%కి పైగా ఎమ్మెల్యే సీట్లు వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి. దీంతో... జ‌గ‌న్ హవాకు బ్రేకులు వేయాల‌ని చంద్ర‌బాబు డిసైడ‌య్యారని...అందుకే ఆయ‌న్ను ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా చేసే అవకాశం ఉంద‌ని స‌మాచారం.

 

అచ్చెన్నాయుడుకు ఆ ప‌ద‌వి అప్ప‌గించ‌డం వెనుక అనేక కార‌ణాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ హ‌వాను తట్టుకొని అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్ర‌స్తుతం ఉధృతంగా ఉన్న ఉత్తరాంధ్ర సెంటిమెంట్ నేప‌థ్యంలో ఆ ప్రాంత‌ వాసి, బీసీ సామాజికవర్గానికి చెందిన వ్య‌క్తి, పార్టీ త‌ర‌ఫున బ‌లంగా గ‌లం వినిపించే నాయ‌కుడిగా అచ్చెన్న‌ను ఎంచుకోవ‌చ్చున‌ని చెప్తున్నారు. అదే స‌మ‌యంలో ప్ర‌స్తుత అధ్య‌క్షుడు కళా వెంకట్రావు స్థానంలో మరో ఉత్తరాంధ్ర వాసి, బీసీ కావ‌డంతో ... ఆ స‌మీక‌ర‌ణ‌ల‌కు సైతం న్యాయం చేసిన‌ట్లు అవుతుంద‌ని విశ్లేషిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ మేర‌కు చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకున్నార‌ని, త్వ‌ర‌లో అచ్చెన్నాయుడును అధ్య‌క్షుడిగా ప్ర‌క‌టించ‌నున్నార‌ని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: