ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలకు చెందిన ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రమాదాల్లో అధిక శాతం ప్రమాదాలు మితిమీరిన వేగం కారణంగానే జరుగుతున్నాయి. చాలా సందర్భాల్లో వాహనాలు నడిపేవారి అతివేగం కారణంగా ఏ పాపం తెలియని అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రమాద స్థలంలోనే ఐదుగురు మృతి చెందారు. 
 
గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం మండలం రేపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రమాదస్థలంలోనే ఐదుగురు మృతి చెందగా పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఆటో మినీ లారీ ఒకదానినొకటి ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 
 
పోలీసులు ఈ ఘటన గురించి పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు. పూర్తివివరాలోకి వెళితే ఈరోజు ఉదయం ఒక పాసింజర్ ఆటో గుంటూరు జిల్లా నరసరావుపేట నుండి ఫిరంగిపురం వైపుగా ప్రయాణిస్తున్న సమయంలో వేగంగా వస్తున్న మినీ లారీ ఆటోను ఢీ కొట్టింది. ప్రమాదంలో మృతి చెందినవారు ఫిరంగిపురం మండలం పుట్టకోట గ్రామానికి చెందిన వారని తెలుస్తోంది. 
 
గాయపడిన ఇద్దరి పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం గుంటూరు జిల్లా ఆస్పతికి తరలించారు. పోలీసుల దర్యాప్తులో మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని తేలింది. మృతులు నరసరావుపేటలోని శుభకార్యానికి వెళ్లి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అతి వేగం వలన రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నా కొందరు వాహనదారులు తీరు మాత్రం మార్చుకోవటం లేదు.               

మరింత సమాచారం తెలుసుకోండి: