మహబూబ్ నగర్ జిల్లాకు జిల్లాకు కరువు తీరా నీళ్లిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్లాన్ వేస్తోంది. ఇప్పటికే జిల్లాలోని ప్రాజెక్టులు సాగు-తాగు నీటి అవసరాలను తీర్చలేకపోతున్నాయి. ఫలితంగా జిల్లాలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోతోంది. ఏటికేడాది నీటి కొరత వేధిస్తుండటంతో కనీస అవసరాలు తీరటం కూడా గగనమైపోతోంది. ఈ గండం నుంచి జిల్లాను గట్టెక్కించేందుకు తెలంగాణ సర్కార్ మరో ప్లాన్ సిద్ధం చేసింది. 

 

ఉమ్మడి మహబూబ్‌ నగర్ జిల్లాలో మరో ప్రాజెక్టుకు రూపకల్పనలు జరుగుతున్నాయి. జిల్లాలో సాగు, తాగు నీటి అవసరాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతీ ఏటా 450 నుంచి 1400 టీఎంసీల కృష్ణానది నీరు జూరాల నుంచి దిగువకు వెళ్తున్నాయి. జూరాల ప్రాజెక్టు సామర్థ్యం 9.66టీఎంసీలు మాత్రమే. ఫలితంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మిషన్‌ భగీరథ పథకాలకు, సాగునీటి రంగానికి నీటి తిప్పలు మాత్రం తప్పటం లేదు. ఏడాది మొత్తం రివర్స్‌ పంపింగ్‌తో జూరాల ప్రాజెక్టులో సాగు, తాగునీటి అవసరాలకు నీటిని నిల్వ ఉంచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 

 

జూరాల బ్యాక్‌ వాటర్‌ నుంచి గట్టు ఎత్తిపోతల పథకానికి అవసరమైన నీటిని తరలించడానికి గతంలోనే ముఖ్యమంత్రి కేసిఆర్ గట్టు ఎత్తిపోతలకు శంకుస్థాపన చేశారు. ఆ సమయంలో 0.76 టీఎంసీల రిజర్వాయరు కాకుండా నాలుగు టీఎంసీల రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టాలని కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో అలంపూర్‌, గద్వాల నియోజకవర్గాలతో పాటు జూరాలకు రివర్స్‌ పంపింగ్‌ ద్వారా నీటిని మళ్లించడానికి గట్టు ప్రాంతంలో 15 టీఎంసీల రిజర్వాయర్‌ నిర్మాణానికి డీపీఆర్‌ తయారు చేశారు. దీని నిర్మాణానికి ఆరు వేల కోట్లతో ప్రతిపాదనలు సైతం సిద్ధం చేశారు. ఐతే...ఇంత భారం మోయడం కంటే ప్రత్యామ్నాయంగా కొత్త ప్రాజెక్టును ప్రతిపాదించాలని సీఎం కేసీఆర్‌ నిపుణులకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రిటైర్డు ఇంజినీర్ల బృందం గద్వాల జిల్లాలో పర్యటించింది. 

 

జిల్లాలో పర్యటించిన ఇంజినీర్ల బృందం ధరూరు మండలం నాగర్‌దొడ్డి గ్రామంలో 20 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయరును చేపడితే ఉపయోగం ఉంటుందని అభిప్రాయపడింది. ఇందుకు వెయ్యి కోట్లు మాత్రమే ఖర్చు అయ్యే అవకాశం ఉందంటున్నారు రిటైర్డ్ ఇంజినీర్లు. 

 

జూరాల ప్రాజెక్టు సామర్థ్యం తక్కువగా ఉండటంతో ఏటా నీటి కష్టాలు తప్పటం లేదు. ప్రతీ ఏడాది వేసవిలో రబీ పంటలతో పాటు మిషన్‌ భగీరథ పథకాలకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా రక్షిత మంచినీటి పథకాలకు నీరు అందించడానికి ఇబ్బంది అవుతుంది. జూరాల కింద నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా పథకాలకు 70 టీఎంసీల నీరు అవసరమవుతుంది. ప్రతి ఏటా రబీలో సాగు, తాగు నీరు అందించడానికి జూరాల ప్రాజెక్టు అధికారులకు తలకు మించిన భారం అవుతోంది. నాగర్‌దొడ్డి ప్రాంతంలో 20 టీఎంసీల రిజర్వాయరు నిర్మాణం చేపడితే ఏడాది పొడవునా సాగు, తాగునీటికి ఢోకా ఉండదంటున్నారు రిటైర్డ్ ఇంజినీర్లు. దీంతో పాలమూరు జిల్లా నీటి కష్టాలే తొలగిపోతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: