దేశ రాజధాని ఢిల్లీలో జెండా ఎగురేసేది ఎవరనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ విజేత ఎవరో అంచనా వేసినా.. అధికారిక ఫలితాలు వచ్చేదాకా ఆగాల్సిందే. కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొడతారని ఆప్ ధీమా వ్యక్తం చేస్తుంటే.. సంచలనాలు నమోదవుతాయని బీజేపీ ఆశలు పెట్టుకుంది. 

 

దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చనీయాంశమమైన ఢిల్లీ ఎన్నికల ఫలితాలు.. మరికొన్ని గంటల్లో వెలువడుతున్నాయి. మొహల్లా క్లినిక్, ప్రభుత్వ స్కూళ్లలో ప్రమాణాల పెంపు, అనధికారిక కాలనీల క్రమబద్ధీకరణ లాంటి అంశాలకు తోడు.. సీఏఏ, హనుమాన్ చాలీసా లాంటి భావోద్వేగ అంశాలతో ఢిల్లీ ఎన్నికల ప్రచారం జరిగింది. అభివృద్ధి, సంక్షేమం చూసి ఓటేయాలని ఆప్ కోరితే.. భావోద్వేగ అంశాల్ని రగిలించడానికి బీజేపీ శతధా ప్రయత్నించింది. ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో.. ప్రధాన పార్టీలన్నీ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాయి. 

 

ఢిల్లీలో ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో కేజ్రీవాల్ మూడోసారి సీఎం అవుతారని చెబుతున్నాయి. అయితే బీజేపీ మాత్రం మ్యాజిక్ జరుగుతుందనే విశ్వాసంతో ఉంది. అటు కాంగ్రెస్ కూడా కేజ్రీవాల్ గెలుస్తారని ఇన్ డైరక్టుగా చెబుతోంది. కేజ్రీవాల్ గెలిస్తే.. అభివృద్ధి అజెండా గెలిచినట్టేనని ఆ పార్టీ నేతలు స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. 

 

ఎగ్జిట్ పోల్స్ సరళిని బట్టి చూస్తే.. ఢిల్లీలో అన్ని ప్రాంతాల్లో ఆప్ ప్రతాపం చూపించిందని అంచనాలున్నాయి. పార్లమెంట్ లో బీజేపీకి జై కొట్టిన ఢిల్లీ వాసులు.. అసెంబ్లీకి వచ్చే సరికి సామాన్యుడి పార్టీనే నెత్తిన పెట్టుకుంటారని ఎగ్జిట్ పోల్స్ అంటున్నాయి. 2015 నాటి ఎన్నికల ఫలితాలు రిపీటైనా ఆశ్చర్యం లేదనే విధంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఉన్నాయి. 2015లో మొత్తం 70 స్థానాలకు.. ఆప్ 67 సీట్లు గెలిచి చరిత్ర సృష్టించింది. బీజేపీ మూడు సీట్లతో సరిపెట్టుకోగా.. కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేదు. అటు ఎన్నికల సంఘం కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేసింది. మంగళవారం మధ్యాహ్నానికే విజేత ఎవరో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: