అన్ని రాజ‌కీయ పార్టీలు ఉత్కంఠ‌తో ఎదురుచూస్తున్న ఢిల్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల ఉత్కంఠ మ‌రికొద్ది గంట‌ల్లో వీడ‌నుంది. 70 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల విజేత‌ల‌ను ఎన్నుకునేందుకు చేప‌ట్టే కౌంటింగ్ ప్ర‌క్రియ స‌మ‌ర్థంగా నిర్వహించేందుకు ఈసీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. మొత్తం 21 కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ జరుగనుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండ‌గా... సుమారు మధ్యాహ్నం లోగా ఫలితాలు వెలువడే అవకాశాలున్నాయి.  కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల తీసుకున్న నిర్ణ‌యాల‌కు ఢిల్లీ ఎన్నిక‌లు రెఫ‌రెండ‌మ‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. సానుకూల ఫ‌లితం వ‌స్తే బీజేపీ దూకుడు కొన‌సాగుతుంద‌ని...వ్య‌తిరేక ఫ‌లితం వ‌స్తే...ఆ షాక్‌తో పార్టీ నేత‌లు సంయ‌మ‌నం పాటిస్తార‌ని అంటున్నారు.

 

ఢిల్లీ పోరులో మొత్తం 70 స్థానాలుండగా.. 672 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో 62 శాతం పోలింగ్ న‌మోదు అయింది. అత్యల్పంగా ఢిల్లీ కంటోన్మెంట్‌లో 45.4 శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యధికంగా బల్లిమారన్ నియోజకవర్గంలో 71.6 శాతం పోలింగ్ శాతం నమోదైంది. అయితే… పోలింగ్ శాతం ప్రకటించడంలో ఆలస్యం కారణంగా ఈసీ విమర్శలు ఎదుర్కొంది.

 

ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార ఆమ్‌ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా శ్రమించాయి. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఆప్‌కే పట్టంకట్టాయి. కేజ్రీవాల్ పార్టీ 55 నుంచి 68 వరకు స్థానాలు కైవసం చేసుకుంటుందని ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టం చేశాయి. బీజేపీ 5 నుంచి 19 వరకు దక్కించుకుంటుందని కొన్ని పోల్స్ తెలిపారు. ఇక కాంగ్రెస్ మాత్రం సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతుందని చెప్తున్నాయి. అయితే, తమకే అధిక స్థానాలు దక్కుతాయని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేయ‌డంపై పలు పార్టీలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. కాగా, గత ఎన్నికలో ఆప్ 67 స్థానాల్లో గెలవగా… బీజేపీ మూడు స్థానాలకే పరిమితమైన సంగ‌తి తెలిసిందే. కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల తీసుకున్న నిర్ణ‌యాల‌కు ఢిల్లీ ఎన్నిక‌లు రెఫ‌రెండ‌మ‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: