ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ లో అంచనాలు వచ్చినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దూసుకుపోతోంది. 70 స్ధానాలున్న అసెంబ్లీలో కౌంటింగ్ మొదలుపెట్టగానే సుమారు 53 సీట్లలో ఆప్ మెజారిటిలో బాగా స్పీడుగా ఉంది.  తర్వాత 16 నియోజకవర్గాల్లో బిజెపి, ఒక్కస్ధానంలో కాంగ్రెస్ లీడ్ లో ఉంది. అంటే మెజారిటిల సరళిని గమనిస్తే నరేంద్రమోడికి ఢిల్లీ ఫలితాలు షాక్ ఇవ్వటం ఖాయమనే అనిపిస్తోంది. ఎందుకంటే ఢిల్లీ ఎన్నికలను అంతా తామై మోడి, అమిత్ షా లే నడిపించారు. అయితే వారెంత ప్రయత్నాలు చేసినా పెద్దగా ఉపయోగం కనబడలేదని అనిపిస్తోంది.

 

మొదటి నుండి ఆప్ అధ్యక్షుడు, సిఎం అరవింద్ కేజ్రీవాల్ ను దెబ్బ కొట్టాలన్న ఏకైక ధ్యేయంతోనే బిజెపి పావులు కదుపింది. పద్దతి ప్రకారం ఎత్తుకు పై ఎత్తులు వేసుంటే ఎవరకీ అభ్యంతరం ఉండేది కాదు. కానీ అనైతిక పద్దతుల్లో కేజ్రీవాల్ ను దెబ్బ కొట్టేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.  నామినేషన్ వేసే దశలోనే కేజ్రీవాల్ ను దెబ్బ కొట్టాలని ప్రయత్నించింది. కాకపోతే బిజెపి వ్యూహాలను పసిగొట్టిన కేజ్రీవాల్ ముందు జాగ్రత్తలు తీసుకోవటంతో మోడి ఎత్తులు పారలేదు.

 

అదే సమయంలో  మోడి, అమిత్ షా లు తమ ప్రచారంలో  జాతీయ, అంతర్జాతీయ అంశాలను మాత్రమే చర్చించారు. అయితే కేజ్రీవాల్ మాత్రం కేవలం స్ధానిక అంశాలను మాత్రమే ప్రస్తావించారు. దానికితోడు ముఖ్యమంత్రిగా క్లీన్ ఇమేజ్ కూడా కేజ్రీవాల్ కు బాగా కలిసొచ్చింది. ఢిల్లీ జలమండలి ద్వారా జనాలకు మంచినీటి సరఫరా, 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్, పాఠశాల విద్యను బలోపేతం చేయటం, చౌమల్లా ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసి మధ్య తరగతి, పేదలకు నాణ్యమైన ఆసుపత్రుల సేవలను అందించటం లాంటి అనేక చర్యలు సక్సెస్ అయ్యాయి.

 

సామాన్యులతో కూడా  కలిసిపోయే మనస్తత్వమే కేజ్రీవాల్ కు బాగా కలిసొచ్చింది. దానికితోడు కేజ్రీవాల్ ను మోడి గడచిన ఐదేళ్ళల్లో ఎంతగా మానసికంగా హింసించింది జనాలు దగ్గర నుండి చూశారు.  ఆయన ప్రిన్సిపుల్ సెక్రటరీ కార్యాలయంపై సిబిఐ అధికారులతో దాడులు చేయించారు.  ఇటువంటి అనేక చర్యలతో మోడి అంటే జనాలకు మొహం మొత్తేసింది. దాంతో మంచిపాలనను అందిస్తున్న కేజ్రీవాల్ కే జనాలు జై కొట్టిన విషయం అర్ధమైపోతోంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: