దేశాన్ని మొత్తం కాషాయంతో నింపేయాలనుకుంటున్న మోదీకి అదిరిపోయే షాకులు తగులుతున్నాయి. వరుసగా ఒక్కో రాష్ట్రంలో కమలం వాడిపోతుంది. మోదీ సారథ్యంలోని బీజేపీ 2014 ముందు నుంచి దేశంలో జైత్రయాత్ర కొనసాగించిన విషయం తెలిసిందే. అప్పుడు లోక్ సభలో బంపర్ మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి...పలు రాష్ట్రాల అసెంబ్లీలని కైవసం చేసుకుని సత్తా చాటింది. అయితే మోదీకి 2018 నుంచే ఊహించని షాక్ తగలడం మొదలైంది. వరుసగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, రాజస్తాన్ రాష్ట్రాలో కాషాయ జెండా డౌన్ అయిపోయింది.

 

ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఎలాగో సత్తా లేదు కాబట్టి ఏపీ, తెలంగాణల్లో చతికలపడింది. అలాగే అటు నవీన్ దించేసి ఒడిశాని కైవసం చేసుకోవాలన్న ఆశ కూడా నేరవలేదు. కాకపోతే అసెంబ్లీలో వెనుకపడిన మోదీ, పార్లమెంట్‌లో అదిరిపోయే విక్టరీ అందుకుని కేంద్రంలో రెండోసారి పాగా వేశారు. అయితే కేంద్రంలో విజయం సాధించిన ఆరు నెలల్లోనే ఊహించని షాకులు తగలడం మొదలయ్యాయి.

 

సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారి హర్యానా, మహారాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు జరిగాయి. హర్యానా ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో జయనాయక్ జనతా పార్టీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఏదో హర్యానాలో చావుతప్పి కన్ను లొట్ట పోయిన చందంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇక, మహారాష్ట్రలో మోదీకి అదిరిపోయే షాక్ తగిలేలా కాంగ్రెస్, శివసేన, ఎన్‌సి‌పిలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

 

జార్ఖండ్‌లో వరుసగా రెండోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ భారీ వ్యూహాలే రచించింది. కానీ ఊహించని విధంగా జే‌ఎం‌ఎం-కాంగ్రెస్ కూటమి మెజారిటీ సీట్లు దక్కించుకుని మోదీకి షాక్ ఇచ్చింది. ఇలా వరుసగా షాకులు తగులుతుండగానే మోదీకి అతి పెద్ద షాక్ ఢిల్లీ నుంచి వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో  కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ భారీ విజయం దిశగా దూసుకుపోతుంది. ఇప్పటివరకు తగిలిన షాకులు అన్నీ ఒక ఎత్తు అయితే ఢిల్లీ రూపంలో మోదీకి తగిలిన షాక్ అతి పెద్దది అనుకోవచ్చు. తర్వాత పశ్చిమ బెంగాల్, తమిళనాడు, బీహార్‌ల్లో కూడా మోదీకి కరెంట్ షాకులు వరుసగా తగలడం ఖాయమంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదం కాస్త కాషాయ ముక్త్ భారత్ అయిపోయేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: