ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన సంగ‌తి తెలిసిందే. ముందుగా బ్యాలెట్ ఓట్ల లెక్కింపును చేపట్టి, ఆ తర్వాత ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. మొత్తం 70 స్థానాలకి గాను కౌంటింగ్ జరుగుతుండ‌గా.. దీనికి గాను 21 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక భారీ భద్రత మధ్య, ఈవీఎంలు తెరచుకోనున్నాయి. ఈ పోటీ ఆప్, బీజేపీ మధ్యే ప్రధానంగా జరిగిందని, కాంగ్రెస్ పార్టీకి ఈ దఫా కూడా నామమాత్రపు సీట్లు దక్కే అవకాశాలు లేవని ఎగ్జిట్ పోల్స్ అంటున్నాయి. ఈ దఫా ఓటింగ్ శాతం తగ్గిన నేపథ్యంలో, అది ఎవరికి ప్లస్ పాయింట్ అవుతుందన్న చర్చ కూడా జరుగుతోంది.

 

అయితే ఎవరి లెక్క ఎలా ఉన్నా... ఆప్‌కు మరోసారి హస్తిన పీఠం ఖాయమనే విషయాన్ని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ స్పష్టంగా చెబుతున్నాయి. దీంతో మరోసారి కేజ్రీవాల్ ఢిల్లీకి సీఎం కావడం ఖాయమనే విషయంలో అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. మ‌రోవైపు రెండు దశాబ్దాలకు పైగా ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోలేకపోతున్న బీజేపీ ఈసారి తామే గెలుస్తామని ధీమా వ్యక్తంచేస్తోంది. ఇదిలా ఉంటే..  ఆప్ కేంద్ర కార్యాలయంలో ఉత్సాహ పూరిత వాతావరణం నెలకొంది. ఢిల్లీలోని పండిత్ దీన్‌దయాళ్ మార్గ్‌లో ఉన్న ఆప్ కార్యాలయంలో నేతలు, కార్యకర్తలు సందడి చేస్తున్నారు. అయితే మీడియా కవరేజ్‌పై ఆప్ అధిష్టానం కొన్ని నిబంధనలు విధించినట్లు తెలుస్తోంది. 

 

అలాగే మ‌రోవైపు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలోనూ ఉత్సాహ పూరిత వాతావరణం కనిపిస్తుండ‌డం విశేషం. ఈ నేప‌థ్యంలోనే నేడు వెలువడే ఫలితాలు ఎగ్జిట్ పోల్స్‌కు భిన్నంగా ఉంటాయని బీజేపీ నేతలు అంటున్నారు. ఇలా ఢిల్లీ పీఠం తమదంటే తమదేనని అటు ఆప్, ఇటు బీజేపీ నేతలు నమ్మకాన్ని వ్యక్తం చేస్తుండగా, తుది ఫలితం మధ్యాహ్నంలోగా వెల్లడవుతుందని, ట్రెండ్స్ ప‌ది గంటలకల్లా తెలుస్తాయని అధికారులు తెలిపారు. కాగా, ఇక 2015లో జరిగిన ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం 70 సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ 67 సీట్లను గెలుచుకుని అమోఘ విజయం సాధించ‌గా.. బీజేపీ కేవలం 3 సీట్లతో సరిపెట్టుకున్న విష‌యం తెలిసిందే.
 

మరింత సమాచారం తెలుసుకోండి: