70 నియోజకవర్గాల లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేడు ఉదయం ఎనిమిది గంటలకు ఆరంభమైంది. ఢిల్లీలోని 11 జిల్లాలలో మొత్తం 21 కేంద్రాలలో ఓట్ల లెక్కింపు మొదలయింది. అయితే లెక్కింపు ప్రారంభమైన దగ్గర నుండి ఆమ్ ఆద్మీ పార్టీ తనదైన శైలిలో దూసుకెళుతూ అధిక ఆధిక్యంలో ఉంది. ప్రతాప్ గంజ్ లో ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ముందంజలో ఉన్నారు. ఇదంతా చూస్తుంటే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ చేసిన వ్యాఖ్యలు నిజమవుతాయని తెలుస్తుంది. ఆయన ఓట్ల లెక్కింపు ముందు మీడియాతో మాట్లాడుతూ.. తాము ఈ అసెంబ్లీ ఎన్నికలలో తప్పకుండా గెలుస్తామని.. ఎందుకంటే గత ఐదేళ్లలో తాము ఢిల్లీ అభివృద్ధి కొరకు ఎంతో కష్టపడ్డామని చెప్పుకొచ్చారు. అదేవిధంగా కేజ్రీవాల్ నేతృత్వంలో ఉన్న ఆమ్ఆద్మీ పార్టీ తప్పకుండా ఈ అసెంబ్లీ ఎన్నికలలో గెలుస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ ముందస్తుగానే స్పష్టంగా చెప్పాయి. 

 


ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రారంభమై దాదాపు 50 నిమిషాలు కావస్తుండగా.. 70 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపులు కొనసాగుతుండగా ఆమ్ ఆద్మీ పార్టీ 54 స్థానాలలో ముందంజలో ఉండగా భాజపా మాత్రం కేవలం 15 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కేవలం ఒక్క స్థానంలోనే ఆధిక్యంలో ఉంది. ఇక ఈ ఫలితాలను బట్టి చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మ్యాజిక్ ఫిగర్ ను అలవోకగా దాటేసిందని తెలుస్తుంది. భాజపా పార్టీ ఈశాన్య, వాయవ్య ఢిల్లీ ప్రాంతాలలో మాత్రమే దూసుకుపోతుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ ఇద్దరూ చాలా ఆధిక్యంలో ఉన్నారని తెలుస్తోంది. 

 

ఆమ్ ఆద్మీ పార్టీ విజయం తథ్యం కావడంతో.. ఆయా పార్టీ కార్యాలయాల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఆ పార్టీ ని సపోర్ట్ చేసే ప్రజలు వారి పిల్లలతో సహా కేజ్రీవాల్ ఇంటికి తండోప తండాలుగా చేరుకొని తమ సంతోషాన్ని వెల్లడిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: