ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఊహించినట్టుగా నే వస్తున్నాయి. మరోసారి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ పీఠం ఎక్కడం ఖాయమైంది. ఇది వరుసగా అరవింద్ కేజ్రీవాల్ చీపురు పార్టీకి హ్యాట్రిక్ విజయం. ఇక ఆప్ కు ముందు ఢిల్లీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరోసారి ఇక్కడ డక్ ఔట్ అయ్యింది. 2015 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఖాతా తెరవలేకపోయింది. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ కాబోతోంది.

 

 

ఇక బీజేపీ విషయానికి వస్తే.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఆ పార్టీ నేతలు కొట్టిపారేశారు. మాదే ముమ్మాటికీ విజయమంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. అయితే ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఈసీ ఎన్నికల శాతాన్ని ప్రకటించడంలో ఆలస్యం చేయడం కొన్ని అనుమానాలకు తావిచ్చింది. ఈ విషయాన్ని అరవింద్ కేజ్రీవాల్ కూడా విమర్శలు గుప్పించాడు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారేమో అన్న అనుమానాలు కూడా సోషల్ మీడియాలో వ్యక్తమయ్యాయి.

 

 

అయితే వాస్తవ ఫలితాలు మాత్రం ఎగ్జిట్ పోల్స్ తరహాలోనే వస్తున్నాయి. కేజ్రీవాల్ ఆప్ పార్టీ కనీసం 50 స్థానాలు దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ ఫలితాలు బీజేపీకి నిరాశ కలిగిస్తున్నా.. మరోవైపు ఆనందాన్ని కూడా కలిగిస్తున్నాయి. ఎలాగంటే.. 2015 ఎన్నికల్లో బీజేపీ కేవలం మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకుంది. కానీ ఈ సారి ఆ సంఖ్య కచ్చితంగా రెండంకెల స్కోరు సాధించే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. తక్కువలో తక్కువ పది స్థానాలు గరిష్టంగా 16 స్థానాల వరకూ బీజేపీకి దక్కే అవకాశం ఉంది.

 

 

అదే నిజమైతే ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ వాయిస్ కూడా బాగానే పెరిగే అవకాశం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే దాదాపు 5 రెట్లు బీజేపీ బలం పెంచుకున్నట్టే.. ఇది బీజేపీకి పరాజయంలోనూ ఊరట కలిగించే అంశమే అని చెప్పొచ్చు. భవిష్యత్తులో వచ్చే ఐదేళ్లలో కేజ్రీవాల్ సర్కారుపై పోరాడేందుకు ఈ 15 మంది ఎమ్మెల్యేల బలం కీలకంగా మారే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: