అవును ఎక్కడో స్విచ్ వేస్తే ఇంకెక్కడో బల్బు వెలిగినట్లు ఢిల్లీలో ఆప్ విజయంతో ఏపిలో జగన్మోహన్ రెడ్డి ఫుల్లు హ్యాపీగా ఉండుంటారు.  ఎందుకంటే ఢిల్లీలో ఓటమితో బిజెపికి బ్రేకులు పడ్డాయి కాబట్టి. బిజెపికి బ్రేకులు పడటం 2019లో జరిగిన వివిధ రాష్ట్రాల ఎన్నికలతోనే మొదలైంది లేండి. కానీ ఆ రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి వేరు ఢిల్లీలో ఓటమి వేరుగానే చూడాలి. మొత్తం మీద ఢిల్లీలో బిజెపి ఓడిపోయిందంటే నరేంద్రమోడి, అమిత్ షా  ఓటమిగానే చూడాలి.

 

రెండోసారి బంపర్ మెజారిటితో మోడి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఏపి ప్రయోజనాల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చూపిస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. విభజన చట్టంలోని ప్రత్యేకహోదా ఇవ్వలేదు. విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ ను గాలికొదిలేశారు. లోటు బడ్జెట్ ను కూడా పట్టించుకోలేదు. వెనకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులను కూడా ఇవ్వటం లేదు. ఇలా విభజన చట్టంలో ఇచ్చిన  హామీల్లో దేన్ని కూడా మోడి ప్రభుత్వం నెరవేర్చలేదు.

 

తమ మీదున్న కేసుల్లో నుండి బయటపడాలన్న ఉద్దేశ్యంతో చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి కూడా మోడికి సరెండర్ అయిపోయారు.  దాంతో ఏపికి ఎంత అన్యాయం చేయాలో అంతా చేస్తున్నారు మోడి. ఈ పరిస్ధితుల్లో  బిజెపి గనుక ఢిల్లీ ఎన్నికల్లో గెలిచుంటే అసలు మోడిని పట్టడం ఎవరి వల్లా అయ్యేది కాదేమో.

 

ఈ నేపధ్యంలోనే మోడి అంటే పడని చాలామంది అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ విజయాన్ని సాధించాలని కోరుకున్నారు. వారిలో జగన్ కూడా ఉండేవుంటారనటంలో సందేహం లేదు. సిఎం అయిన దగ్గర నుండి జగన్ ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళి ప్రయోజనాల విషయంలో డిమాండ్లు ఉంచుతున్నా మోడి పట్టించుకోవటం లేదు. కాబట్టి కేంద్రప్రభుత్వం బలహీనపడితేనే రాష్ట్రాలపై ఆధారపడుతుందన్న విషయం తెలిసిందే.

 

అంటే రాజకీయంగా మోడి బలహీనపడితేనే  జగన్ లాంటి వాళ్ళ డిమాండ్లను కేంద్రం ఆమోదిస్తుంది. అప్పుడే ఏపి ప్రయోజనాల విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందిస్తుంది. బంపర్ మెజారిటితో బిజెపి గెలవటం మనఖర్మ అంటూ పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీలో జగన్ చేసిన వ్యాఖ్యల అర్ధమిదే. కాబట్టి ఢిల్లీ ఎన్నికల్లో మోడి ఓడిపోవటం జగన్ కు సంతోషమే అయ్యుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: