ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మైంది. భారీ భద్రత మధ్య, ఈవీఎంలు తెరచుకోనున్నాయి. ఈ పోటీ ఆప్, బీజేపీ మధ్యే ప్రధానంగా జరిగిందని, కాంగ్రెస్ పార్టీకి ఈ దఫా కూడా నామమాత్రపు సీట్లు దక్కే అవకాశాలు లేవని ఎగ్జిట్ పోల్స్ అంటున్నాయి. మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 672 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.  ఇక పోలింగ్ తుది శాతం ఎంతన్న విషయం ఆలస్యంగా ప్రకటించడంతో ఫలితాలపై కొంత ఉత్కంఠ నెలకొనివున్నా, ఎగ్జిట్ పోల్స్ ముక్తకంఠంతో కేజ్రీవాల్ హ్యాట్రిక్ ఖాయమని వెల్లడించిన నేపథ్యంలో, ఆప్ వర్గాలు విజయంపై నమ్మకంతో ఉన్నాయి. అయితే ప్ర‌స్తుతం ప‌రిస్థితుల‌ను బ‌ట్టీ చూస్తుంటే దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 

 

అమ్‌ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్‌ సాధించినా దాని బలం గణనీయంగా తగ్గింది. గెలుపు ఆశలు పెట్టుకుని చతికిలపడిన బీజేపీ గతంతో పోల్చుకుంటే తన బలాన్ని గణనీయంగా పెంచుకుని సంతోష పడుతోంది. ఉద‌యం ట్రెండ్స్‌లో కేవ‌లం 9 చోట్ల ఆధిక్యంలో ఉన్న బీజేపీ 10.30 నిమిషాల‌కు ఏకంగా 22 స్థానాల్లో లీడ్‌లోకి వ‌చ్చి పుంజుకుంటోంది. దీంతో ఆప్ 60 నుంచి 48కు ప‌డిపోయింది. అలాగే 27 చోట్ల రెండు పార్టీలు హోరాహోరీగా త‌ల‌ప‌డుతున్నాయి. అయితే రెండు దశాబ్దాలకు పైగా ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోలేకపోతున్న బీజేపీకి ఈసారి ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 

 

గత అసెంబ్లీ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోదీ మేనియా ఉన్నా ఢిల్లీలో మాత్రం కేవలం మూడు అసెంబ్లీ సీట్లకు పరిమితమైంది బీజేపీ. అయితే  ఆ ఎన్నికల్లో కేవలం మూడు స్థానాలతో సరిపెట్టుకున్న భారతీయ జనతా పార్టీ ఈసారి తన బలాన్ని 20 స్థానాలకు పెంచుకునే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఆ పార్టీ అభ్యర్థులు ఈ స్థానాల్లో మెజార్టీలో ఉన్నారు. ఇలా 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీలో మరోసారి సామాన్యుడినే కొలువు దీర్చాలని అక్కడి ప్రజలు నిర్ణయం తీసుకున్నా.. అసెంబ్లీలో తన బలాన్ని అమాంతం ఐదారు రెట్లకు బీజేపీ పెంచుకుందంటే అతిశయోక్తి కాద‌ని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: