ఆళ్ళ రామకృష్ణారెడ్డి...2014 ముందు వరకు ఈయన గురించి పెద్దగా ఎవరికి తెలియదనే చెప్పాలి. సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆర్కే..2014 ఎన్నికల్లో మంగళగిరి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి కేవలం  12 ఓట్ల తేడాతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఇక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా కొనసాగుతూనే, ఆర్కే తన నియోజకవర్గంలో పనులు చేసుకుంటూ వచ్చారు. అయితే అమరావతి ఎప్పుడైతే తెరమీదకొచ్చిందో, అప్పటి నుంచి ఆర్కే హైలైట్ అవుతూ వచ్చారు.

 

తన నియోజకవర్గం కూడా అమరావతి పరిధిలో ఉండటంతో....తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన భూ సమీకరణకు వ్యతిరేకంగా పోరాడారు. కోర్టులకు ఎక్కారు. కేసులు వేశారు. రాజధాని పేరిట టీడీపీ అక్రమాలకు పాల్పడుతుందని పోరాడారు. అయితే ఎంత చేసినా టీడీపీ అమరావతినే రాజధానిగా మొదలుపెట్టి, ఐదేళ్లలో గ్రాఫిక్స్ చేసి వదిలిపెట్టింది. ఇక దాని ఫలితంగానే 2019 ఎన్నికల్లో నారా లోకేశ్ మంగళగిరి నుంచి పోటీ చేసినా, ప్రజలు మాత్రం ఆర్కేకే మళ్ళీ పట్టం కట్టారు. ఆర్కే సేవలనే కావాలని అనుకున్నారు.

 

అయితే ఆర్కే మళ్ళీ ఎమ్మెల్యే అయ్యి ప్రజలకు అందుబాటులో ఉంటూ, పనులు చేసుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలని అందిస్తున్నారు. ఎమ్మెల్యే అనే స్టేటస్ చూపించకుండా సామాన్యుడుగానే నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఇలా అంతా బాగానే నడుస్తున్న క్రమంలోనే రాష్ట్ర అభివృద్ధి కోసమని జగన్ తీసుకొచ్చిన మూడు రాజధానుల ప్రభావం ఆర్కేపై బాగా పడింది. అమరావతి ప్రాంత ప్రజలు ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ గత రెండు నెలల నుంచి ఆందోళనలు చేస్తున్నారు.

 

ఇక ఈ ప్రభావం వల్ల ఆర్కేకి కాస్త ఇబ్బందికర పరిస్థితులే ఎదురయ్యాయని రాజకీయ విశ్లేషుకులు అంటున్నారు. ఈ పరిస్తితి ఆర్కే కూడా అర్ధమై ఉంటుంది అందుకే, ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ... అధికార వికేంద్రీకరణకు మంగళగిరి శాసనసభ్యుడిని అయిన తాను.. రాజకీయ భవిష్యత్ ఉన్నా లేకపోయినా పట్టించుకోను అన్నారు. తాను కచ్చితంగా జగన్ వెంట నడుస్తానని చెప్పారు.. రాజకీయాల్లో ఉంటే మాత్రం 'ఇన్ జగన్ ఉయ్ ట్రస్ట్' అంటూ ఓ ప్లకార్డును అసెంబ్లీలో ప్రదర్శించారు. ఒకవేళ తాను రాజకీయాల్లో లేకపోతే నేను నా చేలో కనిపిస్తానని గతంలో చెప్పిన మాటల్ని గుర్తు చేశారు. ఆర్కే చెప్పిన ఈ మాటలు చూస్తుంటే, మంగళగిరిలో ఆయనకు బాగానే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని అర్ధం చేసుకోవచ్చు. మరి చూడాలి రానున్న రోజుల్లో ఆర్కే భవిష్యత్ ఎలా ఉండబోతుందో?

 

మరింత సమాచారం తెలుసుకోండి: