దేశ రాజ‌ధాని ఢిల్లీలో...ఆమ్ ఆద్మీ పార్టీ వ‌రుస‌గా మూడో సారి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్‌ ఫిగర్‌ 36 కాగా, ఆప్‌ 60 స్థానాలకు పైగా విజయం సాధించింది. ఆప్‌ గెలుపుతో ఢిల్లీలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో సంబురాలు మిన్నంటాయి. స్వీట్లు పంచుకుంటూ ఆప్‌ శ్రేణులు ఆనందంలో మునిగితేలారు. కేజ్రీవాల్‌ చేసిన అభివృద్ధికి ఢిల్లీ ప్రజలు పట్టం కట్టారని పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి. దేశ‌వ్యాప్తంగా వివిధ పార్టీల నేత‌లు సైతం ఈ విజ‌యంపై స్పందించారు. తాజాగా, తెలంగాణ‌లో అధికార ప‌క్ష‌మైన టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం...ఆప్ విజ‌యంపై రియాక్ట‌య్యారు.

 

 

 

ఆమ్ ఆద్మీ పార్టీ వ‌రుస‌గా మూడో ద‌ఫా విజ‌యం సొంతం చేసుకోవ‌డంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. `` అర‌వింద్ కేజ్రీవాల్ గారు.. వ‌రుస‌గా మూడోసారి స్ఫూర్తివంత‌మై హ్యాట్రిక్ విజ‌యం సొంతం చేసుకున్నారు. మీకు శుభాకాంక్ష‌లు`` అని తెలిపారు. దీనికి కేజ్రీవాల్ సైతం వెంట‌నే స్పందించ‌డం గ‌మ‌నార్హం. ``థ్యాంక్యూ కేటీఆర్ గారు`` అంటూ ఆయ‌న గులాబీ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ శుభాకాంక్ష‌లకు స్పందించారు.

 

 

ఇదిలాఉండ‌గా, త‌న విజ‌యంపై మీడియాతో సైతం కేజ్రీవాల్ మాట్లాడిన సంగ‌తి తెలిసిందే. ఎన్నికల్లో ఆప్‌ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో అరవింద్‌ కేజ్రీవాల్‌ మీడియాతో మాట్లాడుతూ..ఆమ్‌ ఆద్మీ పార్టీపై నమ్మకముంచి మూడోసారి గెలిపించిన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు. ఢిల్లీ ప్రజలకు కల్పించిన సౌకర్యాలే మాకు గెలుపు బాటలు పరిచాయి. ఢిల్లీ ప్రజలకు తక్కువ ధరకే విద్యుత్‌ అందించాం. సామాన్యుడి కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపించాయి. విద్యుత్‌, నీటి సరఫరా, పౌరసేవలే మమ్మల్ని గెలిపించాయి. విద్య, వైద్యం కోసం చేసిన కృషికి ప్రజలు మళ్లీ మమ్మల్ని ఆదరించారు. మరో ఐదేళ్లపాటు మనమందరం కలిసి కష్టపడదాం. ఇవాళ ఢిల్లీ ప్రజలకు లార్డ్‌ హనుమాన్‌ దీవెనలు అందించారు. వచ్చే ఐదేళ్లలో ఢిల్లీ ప్రజలకు మరింత సేవ చేసేందుకు సరైన మార్గాన్ని చూపాలి`అని హనుమాన్‌ను కేజ్రీవాల్‌ కోరుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: