ఎప్పుడైతే జగన్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారో...అప్పటి నుంచి టీడీపీకి ఉత్తరాంధ్రలో కష్టాలు మొదలయ్యాయి. విశాఖపట్నంని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయడాన్ని వ్యతిరేకించడం వల్ల, ఉత్తరాంధ్ర ప్రజలు టీడీపీపై గుర్రుగా ఉన్నారు. చంద్రబాబు మొత్తం అమరావతి మీదే దృష్టి పెట్టడంతో, ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు కూడా తీవ్ర అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఏదో అచ్చెన్నాయుడు లాంటి నేతలు పైకి మాట్లాడుతున్నారు తప్ప, మిగిలిన వారు నోరు మెదపడం లేదు.

 

ముఖ్యంగా విశాఖ టీడీపీ నేతలు ఒక్కరు కూడా అడ్రెస్ లేరు. బాబు వైఖరి వల్ల వీరు పరిస్తితి అగమ్యగోచరంగా మారిందని తెలిసింది.  బాబు అమరావతి మీదే ఉంటే, విశాఖలో పార్టీకి ఫుల్ డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉన్నాయని మదనపడుతున్నారు. అయితే టీడీపీలో ఉన్న అసంతృప్తిని జగన్ క్యాష్ చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. రాబోయే రోజుల్లో వైజాగ్ టీడీపీ నేతలనీ తమవైపు తిప్పుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.

 

అందులో భాగంగానే కొందరు పెద్ద తలకాయలపై జగన్ ఫోకస్ పెట్టి, ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికల ముందు వారిని వైసీపీలోకి తీసుకురావాలని ట్రై చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అదేగాకుండా వైజాగ్ కార్పొరేషన్ ఎన్నికల ముందు, నగరంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలని కూడా లాగేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరిలని పార్టీలో చేర్చుకోకుండానే, సపోర్టర్స్‌గా పెట్టుకున్నారు.

 

ఈ విధంగానే వైజాగ్ ఎమ్మెల్యేల సపోర్ట్ తీసుకుంటే కార్పొరేషన్ సులువుగా కైవసం చేసుకోవచ్చని ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్, వెస్ట్ ఎమ్మెల్యే గణబాబుల మద్ధతు కూడగట్టేందుకు వైసీపీ అధిష్టానం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నగరంలో వీరికి పార్టీతో సంబంధం లేకుండా కాస్త బలం ఉండటంతో, వీరిని పార్టీలోకి తీసుకొస్తే చాలా లాభమని భావిస్తున్నారు. మరి చూడాలి స్థానిక సంస్థల ఎన్నికల ముందు వైజాగ్ టీడీపీలో ఎలాంటి కుదుపులు చోటు చేసుకుంటాయో?

 

మరింత సమాచారం తెలుసుకోండి: