ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాగా బలంగా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది అధికార వైసీపీనే. 2019 ఎన్నికల్లో 175 సీట్లకు గాను, 151 సీట్లు గెలుచుకుంది. 51 శాతం ఓట్లు దక్కించుకుంది. కాబట్టి వైసీపీకి రాష్ట్రంలో తిరుగులేదు. ఇక వైసీపీ తర్వాత బలంగా ఉన్న పార్టీ ఏదంటే ఆటోమేటిక్‌గా ప్రతిపక్ష టీడీపీనే అని చెప్పొచ్చు. ఆ పార్టీకి 40 శాతం ఓట్లు వరకు వస్తే, 23 సీట్లు వచ్చాయి. అయితే టీడీపీ మొన్న ఎన్నికల్లో 175 చోట్ల అభ్యర్ధులని పెట్టినా, చాలాచోట్ల పోటీ ఇవ్వలేక ముందే చేతులెత్తేసింది.

 

అలా పోటీ ఇవ్వలేక చేతులెత్తేసిన నియోజకవర్గాల్లో సూళ్ళూరుపేట ముందు వరుసలో ఉంటుందని చెప్పొచ్చు. అసలు ఎన్నికల ముందే ఇక్కడ ఓడిపోతామని టీడీపీ ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ కేడర్ పెద్దగా పని చేసిన దాఖలాలు లేవు. అటు పోల్ మేనేజ్మెంట్‌లో కూడా పూర్తిగా విఫలమైంది. దీంతో ఈ నియోజకవర్గంలో వైసీపీ విజయం ముందే ఖాయమైపోయింది. టీడీపీ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోవడం వల్ల ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య దాదాపు 73 వేల భారీ మెజారిటీతో గెలిచారు.

 

సరే వైసీపీ ఎలాగోలా గెలిచింది, ఇక నుంచైనా పార్టీని బలోపేతం చేసుకోవాలనే ఆలోచన చేయాల్సిన టీడీపీ, అలాంటి పని ఏమి చేయడం లేదు. అక్కడ కేడర్‌ని పూర్తిగా గాలికొదిలేసింది. ఇక పార్టీని నడిపించాలసిన టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పరసా వెంకట రత్నం సైలెంట్ అయిపోయారు.  దీంతో కేడర్ మొత్తం వైసీపీ వైపు వెళ్లిపోయింది. ఇక ఏదో పార్టీలో మిగిలిన వారు కూడా ఇంకా నియోజకవర్గంలో టీడీపీపై ఆశలు పెట్టుకోవడం వేస్ట్ అనుకుంటున్నారు. ఇంకా ఎన్ని ఎన్నికలు వచ్చిన ఇక్కడ వైసీపీదే గెలుపు అని డిసైడ్ అయిపోయి, తమ దారి తాము చూసుకుంటున్నారు. మొత్తానికైతే సూళ్ళూరుపేటలో టీడీపీ అడ్రెస్ గల్లంతు అయిపోయిందనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: