తెలంగాణలో బలపడేందుకు బీజేపీ నాయకత్వం తీవ్ర ప్రయత్నాలనే చేస్తోంది . ఒకవైపు కాంగ్రెస్ , మరొకవైపు తెరాస అసంతృప్తి నేతలపై గురిపెట్టింది . ఇక తెలంగాణలోని టీడీపీ అగ్ర నేతలు పలువురు బీజేపీ గూటికి చేరిన విషయం తెల్సిందే . ఇక మిగిలిన ఒకరిద్దరు అగ్ర నాయకులు కూడా తెరాస లోకి వెళ్లడం ఇష్టం లేక బీజేపీ లో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది . ఉమ్మడి మహబూబు నగర్ జిల్లాకు చెందిన కొత్తకోట దయాకర్ రెడ్డి దంపతులు టీడీపీ కి గుడ్ బై చెప్పి , కాషాయ గూటికి చేరే అవకాశాలున్నాయన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి . అదే సమయం లో కాంగ్రెస్ నుంచి కూడా ఒకరిద్దరు అగ్ర నేతలను పార్టీ లో చేర్చుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది .

 

ఇక తెరాస కు తామే ప్రత్యామ్నాయమని ప్రచారం చేసుకుంటున్న ఆ పార్టీ ని రాజకీయంగా దెబ్బకొట్టడం లో కమలనాథులు పూర్తిగా విఫలమవుతున్నారు . అందుకే ఈసారి తెరాస లో అసంతృప్తి కొనసాగుతున్న నాయకులపై కమలనాథులు దృష్టి సారించినట్లు సమాచారం . కేంద్ర పెద్దలను ఒప్పించి కీలక పదవి కట్టబెడుతామని ఆశ చూపించి వారిని తమవైపు తిప్పుకోవాలని బీజేపీ కీలక నేతలు భావిస్తున్నారు . ముందస్తు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ వీడి తెరాస లో చేరిన ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ  మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి ని ఆ పార్టీ నాయకత్వం పూర్తిగా విస్మరించింది .

 

ఎన్నికలకు ముందు ఆయనకు ఎంపీ లేదంటే ఎమ్మెల్సీ పదవి కట్టబెడుతామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్,  ఇప్పుడు  ఆయనకు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి . దానికి ప్రధాన కారణం నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో కవిత ఓటమేనని  తెరాస నేతలు  చెబుతున్నారు . అదే సురేష్ రెడ్డి ని బీజేపీ నాయకత్వం తమ పార్టీ లో చేర్చుకునేందుకు మంతనాలు జరుపుతోందని తెలుస్తోంది . నిజామాబాద్ ఎంపీ అర్వింద్ , సురేష్ రెడ్డి తో ఈ మేరకు మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం . 

మరింత సమాచారం తెలుసుకోండి: