ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి ఆ పార్టీ నాయకత్వ తప్పిదమే కారణమా ? , ముఖ్యమంత్రి అభ్యర్థిని కమలనాథులు ముందే ప్రకటించి ఉంటే ఫలితం మరొకవిధంగా ఉండి , ఉండేదా ? అంటే సోషల్ మీడియా వేదిక పలువురు అవుననే సమాధానం చెబుతున్నారు . ఢిల్లీ లో బీజేపీ ఘోర పరాజయం పై సోషల్ మీడియా వేదికగా జోరుగా విశ్లేషణలు కొనసాగుతున్నాయి . అయితే మెజార్టీ సంఖ్యలో నెటిజన్లు బీజేపీ ఓటమికి దారితీసిన కారణాల్లో ముందస్తుగా పార్టీ తరుపున ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోవడమేనని పేర్కొంటున్నారు .

 

ఆమ్ ఆద్మీ తరుపున పార్టీ అధినేతగా ,  ముఖ్యమంత్రి అభ్యర్థిగా అరవింద్ కేజ్రీవాల్ అందరికి సుపరిచితమేనని , అటువంటప్పుడు బీజేపీకి ఎవర్ని చూసి ఓటేయాలన్న ప్రశ్న ప్రజల్లో తలెత్తిందని అంటున్నారు . సార్వత్రిక ఎన్నికల్లో మోడీ ని చూసి బీజేపీకి ఓట్లేసిన ఢిల్లీ ఓటర్లు , ఆ పార్టీ ఎంపీ అభ్యర్థులకు పట్టం కట్టారని గుర్తు చేస్తున్నారు . ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి మోడీ ,షా నాయకత్వాన్ని చూసి ఆ పార్టీ కి ఓట్లు వేసేందుకు ప్రజలు ఆసక్తి కనబర్చలేదని పేర్కొంటున్నారు . దానికి కారణం సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి కంటే , ముందుగానే తమకు తెలిసిన ముఖ్యమంత్రిని గెలిపించుకోవడం బెటర్ అన్న నిర్ణయానికి విద్యావంతులైన ఢిల్లీ ప్రజలు వచ్చారని సోషల్ మీడియా వేదిక విశ్లేషణ చేస్తున్న నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు .

 

దానికి తోడు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇదే అంశాన్ని అన్ని వేదికల ద్వారా ప్రస్తావించడం ద్వారా బీజేపీ బలహీనతను ప్రజలకు ఎత్తి చూపి , ఎన్నికల్లో లబ్ది పొందారని అంటున్నారు . ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి  అభ్యర్థిని ముందస్తుగా ప్రకటించి ఉండి  ఉంటే ఫలితం మరోలా  ఉండేదా ? లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే బీజేపీ నాయకత్వం మాత్రం ఈ విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి మాత్రం దాపురించి ఉండేది కాదన్నది నిర్వివాదాంశం

మరింత సమాచారం తెలుసుకోండి: