హైద‌రాబాద్‌లో నివ‌సిస్తున్న వారికి ఓ తీపిక‌బురు. గ‌తంలో వలే షాకుల ప‌రంప‌ర ఇక ఉండే అవ‌కాశం లేదు. ఎడాపెడా ఇస్తున్న షాకుల‌కు బ్రేకులు వేసేలా...ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన వ్య‌తిరేక‌త‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని ఉప‌శ‌మ‌నం క‌లిగించే నిర్ణ‌యం తీసుకున్నారు. మున్సిపల్‌ నిబంధనలను ఉల్లంఘిచేవారికి జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌(ఈవీడీఎం) విభాగం ఆధ్వర్యంలో  ప్రస్తుతం రూ. 100 నుంచి  లక్ష రూపాయల వరకు జరిమానాలు విధిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రజలనుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  లక్షలాది రూపాయల జరిమానాలు విధించడంపై గత శనివారం జరిగిన జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశంలో కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో మేయర్‌ జరిమానాలపై అధ్యయనం కోసం ఓ కమిటీని ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు. 

 


నిబంధనల ఉల్లంఘనల‌కు పాల్ప‌డిన వారికి జ‌రిమానాలు వేసేందుకు గ్రేట‌ర్ అధికారులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. జరిమానాల విధింపునకు ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను కూడా రూపొందించారు. ఉదాహరణకు రోడ్డుపై సుమారు రూ.1000 విలువ చేసే ఇటుకలు పెట్టినవారికి సైతం ఏకపక్షంగా రూ.25000జరిమానా విధిస్తున్నారు. బాధితుల వాదనను వినకుండా సంబంధిత ఇంటి యజమాని పేరు తెలుసుకొని అతనిపేర ఆన్‌లైన్‌లో జరిమానాను నమోదుచేస్తూ సదరు వ్యక్తికి నోటీసు ఇస్తున్నారు. దీంతో బాధితులు జరిమానా  చెల్లించేకన్నా ఆ వస్తువు తమదికాదని పేర్కొనడం ఉత్తమమని ఆ వస్తువును వదిలేస్తున్నారు. దీంతో, ఈ విష‌యాలు కార్పొరేట‌ర్ల దృష్టికి వ‌చ్చాయి. బ‌ల్దియా స‌మావేశంలో తీవ్ర స్థాయిలో చ‌ర్చ జ‌రిగింది.

 

ఈ నేప‌థ్యంలో... జరిమానాలపై అధ్యయనం కోసం ఓ కమిటీని ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు. నిబంధనల సవరణకు జీహెచ్‌ఎంసీ సన్నాహాలు చేస్తోంది. ఇకమీదట జరిమానాలు విధించేముందు బాధితులకు నోటీసులు జారీచేయాలని,  అంతేకాకుండా తప్పును సవరించుకునేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఒకవేళ సవరించుకోకుంటే జరిమానా విధించాలని, అంతేకాకుండా జరిమానాలపై అప్పీలు చేసుకునే అవకాశం కల్పించాలని నిశ్చయించారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జరిమానాలు విధిస్తున్నట్లు, అయితే దీనిపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీనిపై స్థాయీసంఘం, బల్దియా కౌన్సిల్‌లో చర్చించి సభ్యుల తీర్మానం మేరకు తదుపరి ముందుకు సాగుతామని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: