ఏపీ లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజారిటీ సాధించి 151 సీట్లు దక్కించుకుని తమ రాజకీయ ప్రత్యర్థి టీడీపీకి షాక్ ఇచ్చింది. వైసీపీ కి ఈ స్థాయిలో విజయం దక్కింది అంటే అది జగన్ ఒక్కడి గొప్పతనమే కాదు. దాని వెనుక ప్రశాంత్ కిషోర్ అనే రాజకీయ వ్యూహకర్త కష్టం కూడా ఉంది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎన్నికల వ్యూహాలు రూపొందించడం, వాటిని క్షేత్ర స్థాయిలోకి బలంగా తీసుకెళ్లడం ఇలా అన్ని విషయాల్లోనూ పీకే జగన్ కు సహాయపడ్డాడు. ఏపీలో ఈ స్థాయిలో ఫలితాలు రావడంతో ప్రశాంత్ కిషోర్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ప్రతి రాజకీయ పార్టీ ఆయనతో రాజకీయ వ్యూహాలు రూపొందించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. నిన్న వెలువడిన ఢిల్లీ ఫలితాలు వెనుక కూడా పీకే హస్తం ఉంది. పీకే రాజకీయ సలహాలతో క్రేజీవాల్ సక్సెస్ అయ్యారు అనేది బహిరంగ రహస్యం. దీంతో క్రేజీవాల్ పేరు దేశవ్యాప్తంగా మరింతగా పాపులర్ అయ్యింది. 


తాజాగా తమిళనాడులో ప్రశాంత్ కిషోర్ జగన్ చెరో వైపు ఉండగా మధ్యలో తమిళ సూపర్ స్టార్ విజయ్ ఉన్న ఫోటో తో పోస్టర్లు వెలిశాయి. మధురై ప్రాంతంలో ఈ ముగ్గురు కలిసి ఉన్న పోస్టర్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఏపీని మేం కాపాడుకున్నాం.. ఇబ్బందుల్లో ఉన్న తమిళనాడు మీరే కాపాడుకోవాలి అంటూ జగన్ పీకే విజయ్ చెవిలో చెబుతున్నట్టుగా విజయ్ అభిమానులు కొందరు ఈ పోస్టర్ లను మధురై లో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.   ప్రస్తుతం ఈ పోస్టర్లు తమిళనాడు వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవలే విజయ్ పై ఐటీ దాడులు జరిగాయి. నోటీసులు కూడా ఇచ్చారు. 


విజయ్ ను బిజెపి టార్గెట్ చేసుకుని వేధింపులకు దిగుతోందని విజయ్ అభిమానులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పీకే సలహాలతో తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కష్టాల్లో ఉన్న తమిళనాడు ను రక్షించాలి అన్నదే ఈ పోస్టర్లు ఏర్పాటు వెనుక ఉద్దేశంగా కనిపిస్తోంది. చాలా కాలంగా బిజెపికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ బీజేపీ వ్యతిరేక పార్టీలన్నిటికి సలహాలు ఇస్తూ వారు అధికారంలోకి వచ్చేలా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు వ్యాప్తంగా వెలువడిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: