ప్రస్తుత ప్రపంచం టెక్నాలజీని అన్ని రకాలుగా వాడుకుంటున్నది. ఒక్క క్షణం టెక్నాలజీ లేకపోయినా మనుగడ సాగించాలంటే చచ్చేంత కష్టతరమవుతుంది. ఏ పని జరగాలన్నా టెక్నాలజీ తప్పనిసరైన ఈ లోకంలో... స్మార్ట్ ఫోన్ చాలా కీలకంగా మారింది. ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునే వరకు ఫోను లేనిదే రోజువారి పని జరగని పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా ఉత్తర భారతదేశంలో ఓ జంటకి నిశ్చితార్థం చేయడానికి కూడా స్మార్ట్ ఫోన్ ఉపయోగించారట. అలాగే భవిష్యత్తులో పెళ్లిళ్లు, హనీమూన్స్ కూడా ఫోనులలోనే నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారట.


ఇక వివరాల్లోకి వెళితే.. ఉత్తర భారత దేశానికి చెందిన అమ్మాయి, అబ్బాయి తల్లిదండ్రులు వీళ్ళిద్దరి నిశ్చితార్థం కొరకు పూజారి చేత ఓ మంచి ముహూర్తం కుదిర్చారు. అయితే విదేశాల్లో ఉంటున్న అమ్మాయి, అబ్బాయి వారి నిశ్చితార్థ ముహూర్తానికి వచ్చేందుకు వీలు పడలేదు. వారు ఏవో తమ పనులు బిజీ వలన రాలేకపోయారని తల్లిదండ్రులు చెప్పుకొస్తున్నారు. అయితే ముందుగా కుదిర్చిన ముహూర్తానికే వీళ్లిద్దరు నిశ్చితార్థం జరపాలని తల్లిదండ్రులు అనుకున్నారు. దీంతో అమ్మాయి, అబ్బాయిలకు ఫోన్ చేసి వాళ్ళిద్దరికీ నిశ్చితార్థం నిర్వహిస్తున్నామని.. అందుకుగాను వారు తమ ఇళ్లకు రావక్కర్లేదు కానీ ఓ వీడియో కాల్ చేస్తే సరిపోతుందని చెప్పారు.


అమ్మాయి, అబ్బాయి వీడియో కాల్స్ లోకి రాగానే పై ఫోటోలో చూపినట్టుగా.. రెండు ఫోన్లను రెండు వేర్వేరు పీటలపై పెట్టి పురోహితుడు వారి నిశ్చితార్థం నిర్వహించారు. ఒక ఫోనులో అబ్బాయి.. మరొక ఫోనులో అమ్మాయి సిగ్గులొలికిస్తూ తమ నిశ్చితార్థాన్ని జరుపుకున్నారు. అమ్మాయి, అబ్బాయి ఇద్దరు అక్కడే ఉన్నట్లుగా అక్కడికి వచ్చిన బంధువులు సెల్ఫీ ఫోటోలు తీసుకొని ఆ తర్వాత రెండు ఫోనులపై అక్షింతలు చల్లారు. ఒకవేళ అమ్మాయి, అబ్బాయి తమ పెళ్లి ముహూర్తానికి కూడా విదేశాల్లో బిజీగా ఉండి పెళ్లి మండపానికి రాకపోతే... వీడియో కాల్ చేసి ఆ తతంగం కూడా నిర్వహిస్తారేమో. ఈ ట్రెండ్ ని గనుక ప్రజలు ఫాలో అయితే... ఇక భవిష్యత్తులో అన్ని పెళ్లిళ్లు ఆన్లైన్ లోనే జరుగుతాయేమో. ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టి బంధువులు ఆన్లైన్లో హాజరయ్యి... ఇమోజి అక్షింతలు వేస్తారేమో. ఇకపోతే కాపురాలకి భౌతిక స్పృహ, స్పర్శ తప్పవు కాబట్టి... అది ఒక్కటే ఆఫ్ లైన్ లో చెయ్యక తప్పదు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: