ముక్కుతూ మూలుగుతూ రాజకీయాలను నెట్టుకొస్తున్న కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఎదురుగాలి వీస్తూ వస్తోంది. ఒక్కో రాష్ట్రంలో పట్టు కోల్పోతూ.. కనీసం ఒకటి రెండు స్థానాలు కూడా దక్కించుకోలేని దుస్థితికి కాంగ్రెస్ వెళ్లిపోవడం ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఒక్కో రాష్ట్రంలో ఉనికి కోల్పోతూ వస్తోంది. ఏపీ ,తెలంగాణలో దాదాపు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఇక మూడు సార్లు వరుసగా ఢిల్లీ పీఠాన్ని దక్కించుకుని చక్రం తిప్పిన కాంగ్రెస్ పార్టీ కి నిన్న ఢిల్లీలో వెలువడిన ఫలితాలు కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఉనికి పై నీలినీడలు కమ్ముకున్నాయి. 


జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు పునర్వైభవం వస్తుందని ఆశలు కూడా ఆ పార్టీ నాయకులకు ఇప్పుడు లేకుండా పోయాయి. వరుసగా ఎదురవుతున్న పరిణామాలతో ఆ పార్టీ నాయకులు కూడా విసుగు చెందుతున్నారు. తాజాగా ఢిల్లీ ఫలితాలకు బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ ఇంచార్జి పదవికి పీసీ చాకో రాజీనామా చేశారు. గతంలోనే ఢిల్లీ కాంగ్రెస్ పరాభవానికి మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కారణం అంటూ చాకో వ్యాఖ్యానించారు.అప్పట్లో ఆయన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. 2013 లో ఆమ్ ఆధ్మీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ హవా తగ్గుతూ వస్తోంది. 


2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఆ పార్టీ గెలుచుకో లేకపోయినా ఈ ఎన్నికల్లో పుంజుకుంటుందని అంతా భావించారు. అదేవిధంగా ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తూ  
ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేక పోయింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ వైఫల్యం పై స్పందించిన చాకో కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం ఇప్పుడు ఆమ్ ఆధ్మీకి వెళ్లిపోయిందని, భవిష్యత్తులోనూ కాంగ్రెస్ పుంజుకునే అవకాశం లేదంటూ ప్రకటించారు. ప్రస్తుతం ఢిల్లీలో వెలువడిన ఫలితాలకు బాధ్యత వహిస్తూ తాను రాజీనామా చేస్తున్నాను అంటూ చాకో ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: