కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సుగాలి ప్రీతి అత్యాచార ఘటనపై గళమెత్తారు. కర్నూలు జిల్లాలో సామూహిక అత్యాచారానికి గురై చనిపోయిన సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. సుగాలి ప్రీతికి న్యాయం జరగనప్పుడు కర్నూలులో హైకోర్టు ఎందుకు అంటూ ఆవేశంగా ప్రసంగించారు. అయితే ఈ విమర్శలను వైసీపీ నేతలు తిప్పికొడుతున్నారు.



మూడు సంవత్సరాల క్రితం చంద్రబాబు హయాంలో ఈ సుగాలి ప్రీతి ఘటన జరిగినప్పుడు పవన్ కల్యాణ్ ఎందుకు నిలదీయలేదని పవన్‌ను వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ప్రశ్నించారు. పార్టీ పెట్టిందే ప్రశ్నించడానికి అని చెప్పి ఆ రెండు సంవత్సరాల ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. చంద్రబాబు డైరెక్షన్‌లో రోడ్డు మీదకు వచ్చాడని ప్రజలకు స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. చంద్రబాబు హయాంలోనే సుగాలి ప్రీతి ఘటనపై చార్జిషీట్‌ వేయడం జరిగిందని గుర్తుచేశారు.



వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రీతి తల్లిదండ్రులను తానే స్వయంగా కలిసి వారికి భరోసా ఇచ్చానని హఫీజ్‌ఖాన్‌ చెప్పారు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని రాష్ట్ర హోంమంత్రిని మూడు సార్లు కలిసి మాట్లాడడం జరిగిందని గుర్తు చేశారు. కేసు కోర్టులో ఉండడంతో సమగ్ర దర్యాప్తు మళ్లీ చేపించాలని న్యాయమూర్తితో మాట్లాడి ఆర్డర్‌ కూడా తీసుకువచ్చామన్నారు. ప్రీతి కేసుపై ఒక మహిళా పోలీస్‌ అధికారిని కూడా నియమించామని చెప్పారు.



చంద్రబాబు ప్రభుత్వం లాగే వైయస్‌ జగన్‌ ప్రభుత్వం ఉందనుకోవడం పవన్‌ కల్యాణ్‌ భ్రమ అన్న హఫీజ్ ఖాన్ .. జగన్ ప్రభుత్వంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చామన్నారు. లా అండ్‌ ఆర్డర్‌ విషయంలో సీఎం వైయస్‌ జగన్‌ నిస్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మహిళా భద్రత కోసం సీఎం వైయస్‌ జగన్‌ దిశ చట్టం తీసుకువచ్చారని పవన్‌కు గుర్తు చేశారు హఫీజ్ ఖాన్.

మరింత సమాచారం తెలుసుకోండి: