ఢిల్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ పార్టీ అడ్ర‌స్ గ‌ల్లంతు అయిపోయిన మ‌రుస‌టి రోజే, అనూహ్యంగా ఉత్తరప్రదేశ్‌లోని ఆజమ్‌గఢ్‌లో సీఏఏ, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీకి పార్టీ జనరల్‌ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్రా హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ మాట్లాడుతూ...నరేంద్ర మోది నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని పేద ప్రజలకు పూర్తి వ్యతిరేకంగా నడుచుకుంటోందని ఆరోపించారు. మీకు మద్దతుగా మేమున్నామని ఆమె ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

 


ప్రధాని మోది, హోం మంత్రి అమిత్‌షా వారు ఏం చేస్తే అది దేశంలో అమలు కావాలని ఆరాటపడుతున్నారనీ.. తాము చెప్పిందే శాసనమన్నట్లు వ్యవహరిస్తున్నారని ప్రియాంక‌గాంధీ మండిపడ్డారు. పార్లమెంట్ లో ఆధిక్యం ఉన్నదనీ వాళ్లు చేసే ప్రతి పని సరైనది అనుకొని, ప్రజలపై రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారని ప్రియాంక విమర్శించారు. ఎలాంటి న్యాయబద్దం కాని సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌(సీఏఏ), నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌(ఎన్‌ఆర్‌సీ)కి కాంగ్రెస్‌ పూర్తి వ్యతిరేకమని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజల పక్షాన పోరాడడానికి కాంగ్రెస్‌ ఎప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ ప్రజలకు భరోసా ఇచ్చారు.

 

ఇదిలాఉండ‌గా, ఎన్సీఆర్సీ విష‌యంలో కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఎన్ఆర్సీ డేటా ఆఫ్‌లైన్ కావ‌డం వ‌ల్ల అస్సాంలో ఆందోళ‌న  మొద‌లైంది. డేటా గ‌ల్లంతు అయిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ప్ర‌తిప‌క్షాలు దీన్ని ప్ర‌శ్నించాయి. కావాల‌నే బీజేపీ ఎన్ఆర్సీ డేటాను ప‌క్క‌న పెట్టింద‌ని కాంగ్రెస్ ఎంపీ గౌర‌వ్ గ‌గోయ్ ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో అస్సాంలో  జాతీయ పౌర ప‌ట్టిక కోసం సేక‌రించిన డేటా సుర‌క్షితంగా ఉంద‌ని కేంద్ర హోంశాఖ ఇవాళ స్ప‌ష్టం చేసింది.  క్లౌడ్ స్టోరేజ్‌లో వ‌చ్చిన విజిబులిటీ సాంకేతిక స‌మ‌స్యను ప‌రిష్క‌రించామ‌ని ఆ శాఖ ప్ర‌తినిధి తెలిపారు.  గ‌త ఏడాది ఆగ‌స్టు 31న‌,  www.nrcassam.nic.in. వెబ్‌సైట్‌లో ఎన్ఆర్సీ డేటాను అప్‌లోడ్ చేశారు.  3.4 కోట్ల జ‌నాభా నుంచి సుమారు 19 ల‌క్ష‌ల మంది తుది జాబితాలో స్థానం కోల్పోయిన విష‌యం తెలిసిందే.  క్లౌడ్ ఫ్లాట్‌ఫాంలో డేటాను స్టోర్ చేసేందుకు ఐటీ సంస్థ విప్రోకు కాంట్రాక్టు ఇచ్చారు. గ‌త అక్టోబ‌ర్‌లో ఆ సంస్థ‌తో కాంట్రాక్టు ముగిసింది. అయితే ఎన్ఆర్సీకి కొత్త కోఆర్డినేట‌ర్ రావ‌డం వ‌ల్ల ఇంకా డేటా స్టోరేజ్ రెన్యూవ‌ల్ ప్ర‌క్రియ జ‌ర‌గ‌లేద‌న్నారు.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: