ఆంధ్ర ప్రదేశ్ లో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు జగన్ సర్కార్ రెడీ అయింది .  కోర్టులో ఉన్న కేసులన్నీ ఒక కొలిక్కి వచ్చిన తరువాత ఎన్నికల నిర్వహణ ప్రక్రియ షురూ  కానుంది . అయితే ఎన్నికల్లో ధన , మద్యం ప్రవాహాన్ని నిరోధించాలని జగన్ సర్కార్ భావిస్తోంది . ధనం ...  మద్యం పంపిణీ  చేసినట్లు తేలితే సదరు అభ్యర్థిపై అనర్హత వేటు వేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది . అయితే ఇంతవరకూ అంతాబాగానే ఉన్న అసలు డబ్బులు , మద్యం పంపిణీ చేస్తున్నట్లు ఎలా గుర్తిస్తారన్నది  ప్రశ్నార్ధకంగా మారింది .

 

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు డబ్బులు , మద్యం రెండవ కంటికి తెలియకుండా తమ అనుచరుల చేతనో  , లేకపోతే పార్టీ ముఖ్య నాయకుల చేతనో  పంపిణీ చేయిస్తుంటారు . అటువంటప్పుడు సదరు అభ్యర్థి డబ్బులు , మద్యం పంపిణీ చేస్తున్నాడని ఎలా గుర్తిస్తారు  ?, వారిపై చర్యలు ఎలా  తీసుకుంటారన్న  ప్రశ్నలు తలెత్తుతున్నాయి . ఇక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఒకరిపై మరొకరు డబ్బులు , మద్యం పంపిణీ చేశారంటూ  ఆరోపణలు , ప్రత్యారోపణలు  చేసుకోవడం సర్వ సాధారణం . వారి ఆరోపణలను ఆధారంగా చేసుకుని పోటీ చేసిన  అభ్యర్థులపై  అనర్హత వేటు వేసే అవకాశాలు  ఎంతమాత్రం లేవు  . ఎందుకంటే ఒకవేళ  అలా  అనర్హత వేటు వేస్తే సదరు అభ్యర్థులు  న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశాలు లేకపోలేదు .

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బులు , మద్యం పంపిణీ  అడ్డుకునేందుకు జగన్ సర్కార్ భేషయిన నిర్ణయమే తీసుకున్నప్పటికీ , అమలులోకి వచ్చేసరికి సరైన యంత్రాంగం లేకపోతే మాత్రం ఇబ్బందులు తప్పకపోవచ్చుననే వాదనలు విన్పిస్తున్నాయి . చూడాలి మరి ... ఎన్నికల్లో డబ్బులు , మద్యం పంపిణీ  అరికట్టేందుకు  ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో ?

మరింత సమాచారం తెలుసుకోండి: