ప్రాంతీయ పార్టీలతో జట్టు కడుతూ వాటికి తోకపార్టీగా కాంగ్రెస్  చెలామణి అవుతోందన్న విమర్శలు విన్పిస్తున్నాయి  . 130 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తీవ్ర నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది . ప్రస్తుత  పార్టీ నాయకత్వం,  క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపలేకపోతుంది . అందుకే ప్రాంతీయ పార్టీలు గెలిస్తే , ఆ పార్టీలకు తోకపార్టీ మాదిరిగా ఆనందపడి పోతోంది . ఢిల్లీ కాంగ్రెస్ కు  పెట్టని కోట కాగా , ఇప్పుడు అక్కడ అసలు ఉనికే ప్రశ్నార్థకమైంది .

 

15 ఏళ్ల పాటు ఢిల్లీ పీఠాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీకి తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 4. 26 శాతం ఓట్లు మాత్రమే రావడం ఆందోళన కలిగించే పరిణామం . ఒకటి , రెండు రాష్ట్రాల్లో  కాంగ్రెస్ పార్టీ గెల్చిన,  గత ఆరేళ్లుగా దేశ వ్యాప్తంగా  ఆ పార్టీ  క్రమేపీ ...  తన ఉనికిని కోల్పోతూ వస్తోంది . మహారాష్ట్ర లో శివసేన , ఎన్సీపీ కూటమికి మద్దతునివ్వడం ద్వారా , తాము ఉన్నామని అనిపించుకున్న కాంగ్రెస్,  ఇక కర్ణాటక లో తమ కంటే తక్కువ సీట్లు వచ్చిన జేడీఎస్ కు అధికారాన్ని అప్పగించి , చేతులు కాల్చుకుంది .

 

ఢిల్లీ లో మాదిరిగానే ఆంధ్ర ప్రదేశ్ లోను  కాంగ్రెస్ పార్టీకి  శాసన సభ లో ప్రాతినిధ్యమే  లేకుండా పోయింది . ప్రత్యేక రాష్ట్రం  ఇచ్చామని చెప్పుకున్న తెలంగాణ ప్రజలు రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు .ఇక   ఇప్పుడు తెలంగాణ లో  రెండవ స్థానం కోసం బీజేపీ తో పోటీపడాల్సిన దుస్థితి నెలకొంది . ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల జాబితా చాంతాడంత ఉంది .  ఈ పరిస్థితి ఇంకా ఎన్నాళ్ళన్న అసంతృప్తి  ఆ పార్టీ నేతల్లోను వ్యక్తమవుతోంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: