మెగా నగరాలకే పరిమితమైన బెట్టింగ్‌లు నేడు ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ జ‌రుగుతున్నాయి.  క్రికెట్ మ్యాచులు, రాజ‌కీయాలు ఇలా ఒక‌టా రెండా అనేక వాటిపై బెట్టింగ్‌లు క‌డుతుంటారు. ఈజీ మనీ. గెలిస్తే డబ్బులు వచ్చేస్తాయి. పైకి అంతా బాగానే కనిపిస్తుంది. అంతా ఓ రంగుల ప్ర‌పంచంలా క‌నిపిస్తుంది. ఒక్కోసారి కలిసి వచ్చినట్టుగా అనిపిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. వందల రూపాయలతో మొదలుపెడితే.. డబ్బులు వస్తే అది వేల రూపాయలకు చేరుతుంది. ఒక్కసారి ఆ వ్యసనం పట్టుకుందంటే.. దాన్నుంచి బయటకు రావడం అంత తేలికకాదు.  వీటితో బాగుపడే వాడు ఎవడూ ఉండడు. నాశనం అయ్యేవాడు తప్ప. 

 

ప్ర‌స్తుత యువతరంలో ఈ బెట్టింగ్‌ వ్యసనం తీవ్రస్థాయిలో కనిపిస్తోంది. అత్యంత ఆందోళనకరమైన స్థితిలో ఉంది. దీన్ని నియంత్రించడం అంత తేలికైన ప‌ని కాద‌ని చెప్పాలి. ఇలాంటి బెట్టింగు వ్యవహారాలు చెడినప్పుడు కుర్రాళ్లు పరస్పరం  దాడులు చేసుకోవడం, ఆత్మహత్య యత్నాలు చేయడం.. వంటి వార్తలు కూడా వింటూనే ఉంటాం. అవే ఒక్కో ప్రాణాల మీద‌కు తెస్తాయి.. తీస్తాయి కూడా. ఇక తాజాగా  బెట్టింగ్ వ్యవహారం భీమవరంలో కలకలం రేపుతోంది. బెట్టింగ్ డబ్బులు ఇవ్వాలి అంటూ లోకేష్ అనే యువకుడిని కిడ్నాపర్లు చితకబాదారు. భీమవరానికి చెందిన లోకేష్ బెట్టింగ్ డబ్బుల వ్యవహారంలో ప్రత్యర్థుల నుంచి బెదిరింపులు ఎదుర్కున్నాడు. 

 

ఆ తరువాత లోకేష్‌‌ను వారు కిడ్నాప్ చేశారు. భీమిలి తీసుకువెళ్లి వారం పాటు చిత్రహింసలకు గురిచేశారు. ఈ క్ర‌మంలోనే రూ.35 లక్షలు ఇవ్వాలి అంటూ లోకేష్ తల్లిదండ్రులకు కిడ్నాపర్లు ఫోన్ చేసి డిమాండ్ చేశారు. దీంతో లోకేష్ తల్లి వరలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విష‌యం తెలుసుకున్న కిడ్నాప‌ర్లు అర్ధరాత్రి భీమవరం పద్మాలయ థియేటర్ సమీపంలో లోకేష్‌ను వదిలి వెళ్లిపోయారు. తీవ్ర గాయాలపాలైన లోకేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక కేసు న‌మోదు చేసిన‌ పోలీసులు దర్యాప్తు చేప‌ట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: