ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి త్వరలో స్థానిక సమరం మొదలు కానున్న విషయం తెలిసిందే. మార్చి 15లోపు ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అటు ఎన్నికల సంఘం కూడా స్థానిక సమరాన్ని వీలైనంత త్వరగా నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. ఇక స్థానిక ఎన్నికల్లో సత్తా చాటెందుకు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా అయిన తూర్పుగోదావరిలోని రాజమండ్రి నగర పాలక సంస్థని కైవసం చేసుకోడానికి రెండు పార్టీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి.

 

అయితే రాజమండ్రి నగరం అనేది ఎప్పటి నుంచో టీడీపీకి కంచుకోటగా ఉంటూ వస్తుంది. గత మూడు పర్యాయాలు రాజమండ్రి కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో టీడీపీనే గెలిచింది. ఈ క్రమంలోనే ఈసారి కూడా మేయర్ పీఠాన్ని ఎగరవేసుకుపోవాలని టీడీపీ స్కెచ్ వేస్తుంది. పైగా మొన్న 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ చాలా చోట్ల దారుణ పరాజయం మూటగట్టుకున్న, రాజమండ్రిలో మాత్రం సత్తా చాటింది. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ స్థానాలని టీడీపీనే కైవసం చేసుకుంది.

 

రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి భవాని దాదాపు 30 వేల పైనే మెజారిటీతో గెలిస్తే, రూరల్ నుంచి బుచ్చయ్య చౌదరీ మంచి మెజారిటీతో గెలిచారు. ఇక రాష్ట్రంలో టీడీపీ అధికారం లేకపోయినా, ఇక్కడ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ఉండటం వల్ల, కేడర్ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. దీంతో ప్రతిపక్షంలో ఉన్న మరింత కష్టపడి రాజమండ్రి కార్పొరేషన్‌పై నాలుగోసారి పసుపు జెండా ఎగరవేయాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తుంది.

 

అయితే టీడీపీని ఈసారి ఎలా అయిన నిలువరించి వైసీపీ జెండా ఎగరవేయాలని ఆ పార్టీ నేతలు కష్టపడుతున్నారు. అధికారంలో ఉన్న అడ్వాంటేజ్‌తో రాజమండ్రి టీడీపీకి దక్కకుండా చేయాలని జిల్లా మంత్రులు పిల్లి సుబాష్, విశ్వరూప్, కన్నబాబులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసిన రాజమండ్రిలో టీడీపీ కాస్త ఎడ్జ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ టీడీపీ నాయకత్వం కేడర్ బలంగా ఉండటం వల్ల వైసీపీకి అంత అనుకూల పరిస్థితులు కనబడటం లేదు. కాకపోతే వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఏదైనా జరిగే అవకాశముంది. మరి చూడాలి ఈసారి రాజమండ్రి ఎవరు ఖాతాలో పడుతుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: