ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో తనదైన ముద్ర వేసుకుంటూ కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో పాలన వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్న జగన్ సర్కార్ సర్పంచులకు మరిన్ని అధికారాలు కల్పిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. పంచాయితీరాజ్ మున్సిపల్ చట్టాల సవరణకు ఏపీ క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు... వాటిని సత్వరం పరిష్కరించే విధంగా అత్యవసర నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని సర్పంచులకు కట్టబెట్టేందుకు జగన్ సర్కారు నిర్ణయించింది. 

 

 బుధవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన ఏపీ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. అత్యవసర సమాయాల్లో  సర్పంచులు తీసుకున్న నిర్ణయాలను తదుపరి పంచాయితీ సమావేశంలో ఆమోదం తీసుకునేందుకు వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. అయితే గ్రామాల సర్పంచ్లు ఆయా గ్రామాల్లోని నివాసం ఉండాలంటూ  తీర్మానించారు. ఇందుకు అనుగుణంగా పంచాయతీరాజ్ చట్టం లో పలు కీలక సవరణలు చేసేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అయితే పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో అవినీతి చర్యలకు పాల్పడినట్లు రుజువు అయితే వారిపై అనర్హత వేటు తోపాటు మూడేళ్ల జైలు శిక్ష కూడా ఉంటుందని మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా మున్సిపల్ ఎన్నికలు గతంలో 24 రోజులుగా ఉన్న కాలపరిమితిని 15 రోజులకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ క్యాబినెట్. పంచాయతీకి సంబంధించిన నియమనిబంధనలు అన్నింటిని మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు వర్తింప చేసింది. 

 

 అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి ఉద్యాన రంగాల్లో నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా జగన్ సర్కారు నడుం బిగించింది. దీనిపై జగన్ సర్కారు ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇక పండ్లు పూల తోటలు కూడా ఇచ్చే నష్ట  పరిహారం పెంపు చేపట్టేందుకు నిర్ణయించింది జగన్ సర్కార్. మామిడి కొబ్బరి నిమ్మ తదితర పంటలకు ఇచ్చే పరిహారం పెరగనుంది.ఇక రాష్ట్రంలో పది వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ సొంతగా ఏర్పాటు చేయనున్నది  జగన్ సర్కారు. ప్రస్తుతం రైతులకు పగటిపూట 9 గంటల కరెంటు అందించడం వల్ల ప్రభుత్వంపై ప్రతి ఏటా పది వేల కోట్ల భారం పడుతుందని.. ప్రతి ఏటా సుమారు 50 వేల కొత్త వ్యవసాయ పంప్ లు  ఏర్పాటవుతున్నాయని  పేర్కొంది. అంతే కాకుండా రాష్ట్రంలోని వివిధ శాఖల వద్ద ఉన్న మిగులు నిధులను సక్రమంగా వినియోగించుకునేందుకు ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ పేరుతో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: