ఫ్రెండ్స్‌, ఫ్యామిలీతో సరదాగా రెస్టారెంట్లలో భోజనం చేద్దామనుకుంటున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త !! హోటల్‌ ఫుడ్‌ తింటే... రోగాలు రావడమే కాదు... ఏకంగా ప్రాణాలు పోతున్నాయ్‌. బేగంపేటలోని ఓ హోటల్‌ ఫుడ్‌ తిన్న చిన్నారి చనిపోగా తల్లిదండ్రులు ఆస్పత్రి పాలయ్యారు. ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్స్‌ నిర్లక్ష్యం హోటళ్లు, రెస్టారెంట్లకు వరంగా మారింది.  హోటల్‌ కలరింగో, రెస్టారెంట్‌ పేరో చూసి వెళ్తే.. ప్రాణాలమీదకు తెచ్చుకున్నట్టే.

 

ఇంటి ఫుడ్‌ కంటే... బయటి ఫుడ్‌ భలే టేస్ట్‌. పొరుగింటి పుల్లకూరే రుచి అన్నట్టు బయటి ఫుడ్‌ తినడం నేడు ఫ్యాషన్‌గా మారింది. వారానికి ఓ రోజైనా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి రెస్టారెంట్లలో, హోటళ్లలో భోజనం చేయడం ఇప్పుడున్న ట్రెండ్‌. అలాంటి వాళ్లు ఇకపై తస్మాత్‌ జాగ్రత్తగా ఉండాల్సిందేనంటున్నారు నిపుణులు. హోటల్‌ ఫుడ్‌ తింటే.. ఇప్పటిదాకా రోగాలే వచ్చేవి. ఇప్పుడు ఏకంగా ప్రాణాలు పోతున్నాయ్‌. బేగంపేటలో మానస సరోవర్‌ హోటల్‌ ఘటనే ఇందుకు నిదర్శనం. మానస సరోవర్‌ హోటల్‌ ఫుడ్‌ తిన్న భార్యాభర్తలు పాలు కాగా.. వాళ్ల కుమారుడు మృతి చెందాడు. 

 

టేస్ట్‌ కంటే... హోటల్‌ హంగూ ఆర్బాటాలు... రెస్టారెంట్ల కలరింగ్‌... బ్రాండ్‌ల పేర్లకే నగరవాసులు ఆకర్షితులవుతున్నారు. పలానా హోటల్‌లో తిన్నానని గర్వంగా చెప్పుకునేవాళ్లు ఎక్కువైపోయారు. భోజన ప్రియులకు తగ్గట్టే టేస్ట్‌ కంటే కలరింగ్‌కే ఇంపార్టెన్స్‌ ఇస్తూ రోజుకో థీమ్‌తో గల్లీగల్లీకో రెస్టారెంట్‌, హోటల్‌ పుట్టుకొస్తున్నాయి. 

 

చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకున్నట్టు... కొన్ని హోటళ్లు బ్రాండ్‌తో బతికేస్తున్నాయ్‌‌. పేరు చూసి... వెరైటీస్‌ చూసి.. భోజనానికి వెళ్తున్న కస్టమర్లు... తినే ఫుడ్‌ ఎంతవరకు ఆరోగ్యకరమన్నది మాత్రం ఆలోచించడం లేదు . చికెన్‌, మటన్‌, ప్రాన్స్‌ వంటి నాన్‌వెజ్‌తోపాటు వెజిటేరియన్‌ ఫుడ్‌ తినాలన్నా హైదరాబాద్‌లో ఒకటికి వందసార్లు ఆలోచించే పరిస్థితులు వచ్చాయి.

 

చిన్నాచితకా వాటిని  పక్కన పెడితే... స్టార్‌ హోటళ్లలోనూ భద్రత కరువైంది. నగరంలోని ఏ హోటల్‌లోనైనా మటన్‌ బిర్యానీ తినాలంటే హడలెత్తే పరిస్థితి వచ్చింది. అటు చికెన్‌ ముక్క కూడా చిక్కులు తెస్తోంది. కొంతమంది మాత్రం సిటీలో లైవ్‌ కుకింగ్‌ ఉన్న హోటల్స్‌ను ఎంచుకుంటున్నారు. కస్టమర్ల టేస్ట్‌కు తగ్గట్టు వాళ్ల ముందే ఓపెన్‌ కిచెన్‌లో వండి ఇస్తున్నారు. మటన్‌, చికెన్‌, వెజ్‌ కర్రీస్‌, చపాతీలు ఇలా కస్టమర్లు కోరుకున్న ప్రతీ ఐటమ్‌ను వాళ్ల ముందే రెడీ చేస్తున్నారు. ఆరోగ్యకర భోజనం చేయాలంటే.. ఓ గంట వెయిట్‌ చేయడంలో శ్రమేం ఉండదంటున్నారు. 

 

హోటళ్లు రెస్టారెంట్లు తనిఖీలు చేయాల్సిన ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్స్‌ నిర్లక్ష్యం... వీరికి వరంగా మారుతోంది. కల్తీ నూనెలు, కుళ్లిపోయిన కూరగాయలు, నిల్వ ఉంచిన మాంసం, చెత్త నీటితో వండుతున్న హోటళ్లు సిటీలో చాలానే ఉన్నాయి. ఇంత పెద్ద సిటీకి ఉన్నది కేవలం ముగ్గురు ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్స్‌.  అయినా వీరు తనిఖీలు చేయడం వదిలేశారు. పోనీ అడపాదడపా చేసి నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకున్నారా అంటే అదీ లేదు. ఇప్పటికైనా అధికారులు క్వాలిటీ పాటించని హోటళ్లపై చర్యలు తీసుకోకపోతే.. రోజుకో ఓ ఫుడ్‌ పాయిజన్‌ కేసు నమోదయ్యే పరిస్థితి తలెత్తడం ఖాయమంటున్నారు నగరవాసులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: