అమెరికా అధ్యక్ష్యుడు డోనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటన ఖరారైంది. ఈ నెల 24, 25 తేదిల్లో ట్రంప్‌ ఇండియాలో పర్యటిస్తాడని వైట్‌ హౌస్‌ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. అయితే ఈ పర్యటనలో భాగంగా ట్రంప్‌, ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి రోడ్‌ షోలో పాల్గొననున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ విమానాశ్రయం నుంచి గాంధీనగర్‌ వరకు ఈ రోడ్‌ షో కొనసాగనుంది. అయితే ఈ మార్గంలో ఉన్న మురికివాడలు ఇప్పుడు సమస్యగా మారాయి.

 

ట్రంప్‌ రాక కోసం రోడ్‌ షో జరిగే మార్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అందులో భాగంగా ఆ మార్గంలో ఉన్న మురికివాడలు ట్రంప్‌ కంటపడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అందుకోసం దాదాపు అర కిలోమీటకు పొడవున 7 అడుగుల ఎత్తు గోడను నిర్మించాలని నిర్ణయించారు. అంతేకాదు ఇప్పటికే నిర్మాణ పనులు కూడా చేపట్టారు. ఆ ప్రాంతంలో దేవ్‌ శరణ్‌ అనే మురికివాడ ఉంది. అక్కడ దాదాపు 500లకు పైగా గుడిసెల్లో 2500 మంది నివాసం ఉంటున్నారు. 

 

ఈ ప్రాంతం రోడ్‌ షో సమయంలో కనిపించకుండా ఉండేలా సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విమానాశ్రయం నుంచి ఇందిరా బ్రిడ్స్‌ వెళ్లే దారిలో గోడ నిర్మిస్తున్నట్టుగా ఓ జాతీయ మీడియా పేర్కొంది. ఎన్నో ఏళ్లుగా ఎలాంటి మరమ్మత్తులకు నోచుకోని రోడ్లు ఇప్పుడు ట్రంప్‌ రాకతో బాగుపడుతుండటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోడ్‌ షోలో దాదాపు 70 లక్షల మంది ప్రజలు పాల్గొంటారని మోధీ తనతో చెప్పినట్టుగా ట్రంప్‌ వెల్లడించారు. అంటే ఆ స్థాయిలో ఏర్పాట్లు జరగుతున్నాయనమాట.

 

గతంలో ట్రంప్‌ కూతురు ఇవాంకా హైదరాబాద్‌ పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఇలాంటి ఏర్పాట్లే చేశారు. బిచ్చగాళ్లను రోడ్లపై కనిపించకుండా నిర్బంధించినట్లు చాలా వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను అధికారులు కొట్టిపారేశారు. బిల్ క్లింటన్, బిల్ గేట్స్ హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సమయంలోనూ బిచ్చగాళ్లను రోడ్లమీద తిరగనివ్వలేదనే ప్రచారం కూడా జరిగింది. అలాగే చైనా అధ్యక్షుడు జీజింగ్‌పిన్, జపాన్ ప్రధాని షింజో అబే గుజరాత్‌లో పర్యటించారు. ఆ సమయంలోనూ వారికి దేశంలోని పేదరికం ఇబ్బందులు వారిక కంటపడుకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: