జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో ఉండే సమయంలోనే  తెలుగుదేశంపార్టీ బల ప్రదర్శనకు దిగుతోంది.  కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో జగన్ భేటి అవ్వటానికి శుక్రవారం మళ్ళీ ఢిల్లీకి చేరుకుంటున్నారు. రాష్ట్రానికి సంబంధించిన  కీలక అంశాలపై  కేంద్ర హోంశాఖ మంత్రే ముందుగా  నిర్ణయం తీసుకోవాలి. ఆ తర్వాతే ఇతర ప్రక్రియలు మొదలవుతాయి. అందుకనే అమిత్-జగన్ భేటికి రాజకీయంగా చాలా ప్రాధాన్యత ఉందనే అనుకోవాలి.

 

శాసనమండలి రద్దు, మూడు రాజధానుల ఏర్పాటు అంశాలు ప్రస్తుతం కేంద్రప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉంది. అంటే మూడు రాజధానుల అంశమంటే ప్రధానంగా కర్నూలుకు హై కోర్టు ఏర్పాటు ఒక్కటే లేండి. హై కోర్టు ఏర్పాటు చేయాలన్నా లేదా మార్చాలన్నా అందుకు సుప్రింకోర్టు కొలీజియం అనుమతి అవసరం. దానికన్నా ముందు హోం శాఖ క్లియరెన్స్ కావాలి. అందుకనే అమిత్ షా తో జగన్ భేటి అవుతున్నది.

 

ఇదే సమయంలో  టిడిపి ఎంపిల ఆధ్వర్యంలో కొందరు మాజీ మంత్రులు, మాజీ ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు ఢిల్లీకి చేరుకుంటున్నారు. వీళ్ళు కూడా కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, పార్లమెంటరీ పార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసే అవకాశం ఉంది. వీళ్ళు ఢిల్లీకి ఎందుకు వస్తున్నారంటే ప్రధానంగా జగన్ పై ఫిర్యాదు చేయటానికే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

 

రెండు పార్టీల నుండి అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే దాదాపు ఒకే డిమాండ్ పై పరస్పర విరుద్ధమైన వాదనలతో  వైసిపి, టిడిపి పంచాయితి ఢిల్లీలో మొదలవ్వబోతోంది. కాకపోతే ఒకవైపు జగన్ మరోవైపు టిడిపి సీనియర్ నేతలుంటారంతే. మరి ఎవరి వాదనకు కేంద్రం మద్దతుగా నిలబడుతుందో చూడాలి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారమైతే జగన్ వాదనకు ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోడి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఎందుకంటే మోడికి జగన్ తో  భవిష్యత్తులో చాలా అవసరం ఉంది కాబట్టి.

మరింత సమాచారం తెలుసుకోండి: