ములుగు నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే ధ‌న‌స‌రి సీత‌క్క‌కు కేసీఆర్ నుంచి క‌బురందిదంట‌. ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు  మ‌రోసారి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆస‌క్తి చూపుతున్నార‌ట‌. గ‌తంలోనూ ఆమె రాక‌ను ఆహ్వానించార‌ని, అయితే ఎందుక‌నో  సీత‌క్క పునారాలోచ‌న‌లో ప‌డి కాంగ్రెస్‌లోనే కొన‌సాగార‌ని ములుగు రాజ‌కీయ వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి. అదే స‌మ‌యంలో రేవంత్‌రెడ్డి త‌న‌పై ఉంచిన విశ్వాసానికి ఆమె కృతజ్ఞ‌త‌గా పార్టీలో కొన‌సాగుతున్న‌ట్లుగా కూడా చ‌ర్చ జ‌రుగుతోంది. కాంగ్రెస్ అధిష్ఠానం త‌న‌కు అడ్డ‌క్కుండానే పార్టీ టికెట్ ఇవ్వ‌డంతో పాటు .జాతీయ‌స్థాయి ప‌ద‌వుల‌ను ఇచ్చింద‌న్న సంతృప్తితోనే ఆమె పార్టీలో ఉంటున్న‌ట్లు స‌మాచారం.

 

సీత‌క్క సుదీర్ఘ‌కాలం పాటు  టీడీపీలో ప‌ని చేశారు. గ‌త ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కొద్దిరోజుల ముందు రేవంత్‌రెడ్డితో పాటే ఆమె కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్ర‌స్తుతం జాతీయ మ‌హిళా కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌నిచేస్తున్నారు. జాతీయ రాజ‌కీయాల్లో మాత్రం చురుకుగా లేరు. సొంత నియోజ‌క‌వ‌ర్గం దాటి బ‌య‌ట‌కి వెళ్ల‌డానికి ఆమె పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌రు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే ఇటీవ‌ల ములుగు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో జ‌రిగిన మేడారం కుంభ‌మేళలో ప్రోటోకాల్ ప్ర‌కారం గులాబీ నేత‌ల‌తో క‌ల‌సి ప‌నిచేయాల్సి వ‌చ్చింది. 

 

మంత్రులు ద‌యాక‌ర్‌రావు, స‌త్య‌వ‌తి రాథోడ్‌, మాజీ డిప్యూటీ సీఎం క‌డియంతో పాటు చాలామంది సీనియ‌ర్ల‌తో ఆమె టీడీపీలో క‌ల‌సిప‌నిచేశారు. ఇప్పుడు వారంతా టీఆర్ ఎస్ గూటికి చేరుకున్నారు. గులాబీ వ‌నంలో సీత‌క్క ఒక్క‌తే కాంగ్రెస్‌లో ఉండ‌టం మ‌న‌కు ఏమాత్రం న‌చ్చ‌డం లేదంటూ  చ‌మ‌త్క‌రించార‌ట‌. అయితే సీత‌క్క న‌వ్వి వ‌దిలేశార‌ట‌. అయితే ఇది అక్క‌డితో ఆగ‌లేదు. ఆదివాసీ మ‌హిళ రాజ‌కీయ నేత‌లు టీఆర్ ఎస్ నేత‌లు త‌క్కువ‌గా ఉన్నార‌నే చెప్పాలి. ఇక ములుగు నియోజ‌క‌వ‌ర్గంలో టీఆర్ ఎస్‌కు స‌రైన నాయ‌క‌త్వం లేదు. మాజీ మంత్రి చందూలాల్ ఆరోగ్యం బాగోలేక‌పోవ‌డంతో ఆయ‌న ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. 

 

ఆయ‌న త‌న‌యుల‌పై పార్టీలోనూ..అధిష్ఠానం వ‌ద్ద వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయి.  రాష్ట్ర‌మంతా ఒక లెక్క‌..ములుగులో ఒక లెక్క ఉండ‌టంపై కేసీఆర్‌, కేటీఆర్‌ల‌లో వ‌ర్రీ ఉందంట‌. సీత‌క్క‌ను తీసుకువ‌స్తే ఏ గొడ‌వ ఉండ‌ద‌ని భావిస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే ఓ మాజీ మంత్రి ద్వారా సీత‌క్క‌కు రాయ‌భారం పంపిన‌ట్లుగా కూడా తెలుస్తోంది. చూడాలి సీత‌క్క కాంగ్రెస్లోనే కొన‌సాగుతారా..?  లేదంటే గులాబీ గూటికి చేరుకుంటారా అన్న‌ది..?!

మరింత సమాచారం తెలుసుకోండి: