సామాన్య భక్తులకు కల్యాణం లడ్డూ ప్రసాదాన్ని అందుబాటులోకి తెచ్చింది టీటీడీ. ఇప్పటి వరకు వీఐపీలు, సేవా టికెట్లు ఉన్నవారికే దొరికే కల్యాణం లడ్డూ.. ఇకపై అందరికీ లభించనుంది. ఎలాంటి సిఫార్సు లేఖలు లేకూండా నేరుగా కౌంటర్లో భక్తులు కోనుగోలు చేసుకునే విధానం మొదలైంది. 

 

తిరుమలకు వచ్చే భక్తులంతా శ్రీవారి దర్శనం తర్వాత.. అంత ప్రాధాన్యత ఇచ్చేది లడ్డూ ప్రసాదానికే. టీటీడీ మూడు రకాల లడ్డూ ప్రసాదాలు తయారు చేయిస్తుంది. 25 గ్రాములు ఉండే చిన్న లడ్డూని.. భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తుంది. 175 గ్రాములు ఉండే లడ్డూ ప్రసాదాన్ని శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఉచితంగా పంపిణీ చేస్తోంది టీటీడీ. అదనంగా కావాలంటే భక్తులు 50 రూపాయలు ఇచ్చి కొనుక్కోవాలి. మూడోది పెద్ద లడ్డూ. దీన్నే కల్యాణం లడ్డూగా వ్యవహరిస్తారు. ఆర్జిత సేవలు చేసుకున్న భక్తులు, సిఫార్సు లేఖలు ఉన్న భక్తులకు మాత్రమే కల్యాణం లడ్డూ విక్రయించేది టీటీడీ. అది కూడా పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండేవి. ప్రతి రోజూ 4 వేల కల్యాణం లడ్డూలు అందుబాటులో ఉంటాయి. ఆర్జిత సేవ భక్తులకు 3 వేలు పోనూ.. ఇక వెయ్యి లడ్డూలే ఉండేవి. దీంతో వీటికి ఫుల్ డిమాండ్ ఉండేది. అయితే ఇప్పుడు కల్యాణం లడ్డూలు అందరికీ అందుబాటులో ఉంచాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. 

 

లడ్డూ ప్రసాదం తయారీకి సంబంధించిన ముడిసరుకుల దిట్టం.. బ్రిటీష్ కాలం నుంచి పుస్తకంలో వివరంగా ఉంది.  లడ్డూ ప్రసాదానికి సంబంధించి ఒక్క ప్రోక్తం అంటే.. 5,100 లడ్డూలు వస్తాయి. దీని తయారీకి 200 కేజీల శనగపిండి, 400 కేజీల చక్కెర, 35 కేజీల జీడి పప్పు,5 కేజీల ఏలకులు,17.5 కేజీల ఎండు ద్రాక్ష,10 కేజీల కలకండ,185 కేజీల నెయ్యిని వినియోగిస్తారు. ఇక కల్యాణం లడ్డూ ప్రోక్తం అంటే 51 లడ్డూలు వస్తాయి. దీని తయారీకి.. 16 కేజీల చక్కెర,1.2 కేజీల జీడి  పప్పు, 640 గ్రాములు ఎండు ద్రాక్ష, 320 గ్రాముల ఏలకులు, 6.6 కేజీల నెయ్యి, 420 గ్రాముల బాదం పప్పును వినియోగిస్తారు. చిన్న లడ్డుకు కూడా లడ్డూ ప్రసాదం దిట్టాన్నే అమలు చేస్తున్నారు. చిన్న లడ్డూకు 7 రూపాయలు ఖర్చవుతుంటే.. లడ్డూ ప్రసాదానికి 38 రూపాయలు, కల్యాణం లడ్డూకు 170 రూపాయలు వ్యయం అవుతోంది. కల్యాణం లడ్డూను స్వామికి నైవేద్యంగా సమర్పించడం, రుచి ఎక్కువగా ఉండటంతో.. దీనికి ప్రాధాన్యత ఎక్కువ. ఇకపై ప్రతి రోజూ పది వేల కల్యాణం లడ్డూలు అందుబాటులో ఉంచడంతో పాటు.. ఎలాంటి సిఫార్సు లేకుండా కౌంటర్లో కొనుక్కునే ఏర్పాట్లు చేసింది టీటీడీ. ఇదే తరహాలో వడ ప్రసాదం కూడా అందుబాటులో ఉంచే యోచనలో ఉంది. టీటీడీ నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: