టీడీపీకి కంచుకోట లాంటి ఉత్తరాంధ్ర జగన్ దెబ్బకు కుదేలైపోయిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో జగన్ సునామీకి సైకిల్ అడ్రెస్ లేకుండా పోయింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో టీడీపీకి చావుదెబ్బ తగిలింది. సరే ఎన్నికల్లో ఓడిపోయిన, ఈ మూడు జిల్లాల్లో బలంగానే ఉన్న అని భావిస్తున్న టీడీపీకి, ఊహించని విధంగా మూడు రాజధానుల రూపంలో భారీ షాక్ తగిలింది.

 

విశాఖపట్నంని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని జగన్ ఫిక్స్ అవ్వడం, కాదు  అమరావతిలోనే మొత్తం రాజధాని ఉండాలని చంద్రబాబు డిమాండ్ చేయడంతో ఉత్తరాంధ్ర ప్రజల్లో టీడీపీపై నెగిటివ్ పెరిగింది. ఇక బాబు అమరావతి కోసం ఎంత పెద్దగా ఉద్యమం చేస్తే, అంతే స్థాయిలో ఉత్తరాంధ్రలో బాబుకు వ్యతిరేకిత పెరుగుతుంది. ఈ క్రమంలోనే ఇక టీడీపీలో ఉంటే భవిష్యత్ కష్టమనే భావిస్తున్న నేతలు, తట్టా బుట్టా సర్దుకుని వెళ్లిపోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది.

 

శ్రీకాకుళం జిల్లాలో ఉన్న సీనియర్ నేత కొండ్రు మురళి లాగేజ్ సర్దుకుని ఉన్నారట. కాంగ్రెస్ హ‌యాంలో 2009లో రాజాం నియోజకవర్గం నుంచి విజ‌యం సాధించిన కొండ్రు కాంగ్రెస్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో మంత్రిగా కూడా చ‌క్రం తిప్పారు. అయితే, రాష్ట్ర విభ‌జ‌న‌తో కాంగ్రెస్ పూర్తిగా దెబ్బతిన్న నేప‌థ్యంలో కొండ్రు రాజకీయ జీవితం కూడా ఇబ్బందిల్లో పడింది. కాకపోతే 2014లో కాంగ్రెస్ లోనే ఉన్న మురళి, 2019 ఎన్నికల ముందు టీడీపీలో చేరిపోయారు.

 

అయితే రాజాం టికెట్ కోసం మాజీ స్పీక‌ర్ ప్రతిభాభార‌తి వంటివారు పోటీలో ఉన్నప్పటికీ.. చాక‌చ‌క్యంగా చంద్రబాబును మెప్పించి టికెట్ తెచ్చుకున్నారు. కాకపోతే టికెట్ దక్కించుకున్న ఆనందం జగన్ దెబ్బతో పోయింది. ఆ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. ఇక ఓడిపోయాక సైలెంట్ అయిన కొండ్రు, మళ్ళీ మూడు రాజధానులతో బయటకొచ్చారు. టీడీపీలో ఉంటూనే జగన్ నిర్ణయాన్ని సమర్ధించారు.

 

దీంతో కొండ్రుపై టీడీపీ అధిష్టానం గుర్రుగా ఉంది. ఈ క్రమంలోనే ఆయన టీడీపీలో ఉంటే కష్టమని భావించి వైసీపీలోకి వెళ్ళేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. బీజేపీ నుంచి ఆఫర్ వచ్చిన ఆయన మాత్రం జగన్ చెంతకే చేరాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అన్నీ అనుకున్నట్లు జరిగితే లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందు కొండ్రు వైసీపీలో చేరే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: