మరోసారి మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర కేబినెట్ బెర్త్ దక్కనుందా? మోడీ మంత్రివర్గంలో చిరంజీవి కొలువుదీరనున్నాడా? అంటే రాజకీయ విశ్లేషుకులు నుంచి అవుననే సమాధానం ఎక్కువ వినిపిస్తుంది. ప్రజారాజ్యం పార్టీ పెట్టి, తర్వాత దాన్ని నడపలేక కాంగ్రెస్‌లో విలీనం చేసి, చిరంజీవి అప్పటి మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో పర్యాటక శాఖామంత్రి అయిన విషయం తెలిసిందే. అయితే 2014 తర్వాత కాంగ్రెస్ పరిస్తితి పూర్తిగా నాశమైపోవడంతో చిరంజీవి, రాజకీయాలకు దూరమైపోయారు.

 

రాజ్యసభ పదవి ఉన్నంత కాలం అప్పుడప్పుడు మీడియా ముందు కనిపించిన, తర్వాత పదవి కాలం పూర్తయ్యాక అడ్రెస్ లేకుండా వెళ్ళిపోయారు. ఇక రాజకీయాలు పడవు అనుకుని సినిమాల్లోకి కూడా రీ ఎంట్రీ ఇచ్చి ఆ పనిలో బిజీగా ఉన్నారు. అయితే ఇలా సినిమాల్లో బిజీగా ఉన్న చిరంజీవికి ఇప్పుడు మళ్ళీ కేంద్ర పదవి దక్కనుందని ప్రచారం జరుగుతుంది. అది కూడా బీజేపీ సహకారంతో, వైసీపీ కోటాలో అవుతారని సమాచారం.

 

అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చిరంజీవి కాస్త జగన్‌కు అనుకూలంగా నడుస్తున్న విషయం తెలిసిందే. ఆయన తన సైరా సినిమా విడుదల సమయంలో జగన్ ఇంటికెళ్ళి మరి ముచ్చట్లు పెట్టి వచ్చారు. అటు జగన్ కూడా సైరా సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చారు. తర్వాత జగన్ మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొస్తే దాన్ని పవన్ వ్యతిరేకిస్తే, చిరంజీవి స్వాగతించారు.

 

ఇక ఈ పరిణామాల నేపథ్యంలో చిరంజీవికి ఊహించని పదవే దక్కబోతుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. తాజాగా జగన్ మోడీతో భేటీ అవ్వడం, వైసీపీ ఎంపీలకు కేంద్ర మంత్రివర్గంలో ఛాన్స్ ఇవ్వనున్నారనే ప్రచారం రావడంతో చిరంజీవి పేరు తెరమీదకొచ్చింది. చిరంజీవికి పదవి ఇస్తే ఎలాంటి ఇబ్బంది రాదనే ఉద్దేశంతో అటు బీజేపీ, ఇటు వైసీపీలు ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.

 

అందుకే తమ సహకారంతో వైసీపీ కోటాలో చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ ప్లాన్ చేసినట్లు సమాచారం. చిరంజీవికి పదవి ఇవ్వడం వల్ల సౌత్‌లో బీజేపీకి కాస్త పాజిటివ్ ఉంటుందని, ఇక ఇటు ఏపీలో వైసీపీకి కాపుల మద్ధతు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మరి చూడాలి చిరంజీవికి మళ్ళీ కేంద్ర మంత్రి పదవి దక్కుతుందో? లేదో?  

మరింత సమాచారం తెలుసుకోండి: