కొమురంభీం ఆసీఫాబాద్‌ జిల్లా సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మ‌రోమారు త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. వేస‌విలో ఉచితంగా మ‌జ్జిగ‌, అంబ‌లి స‌ర‌ఫ‌రా చేయ‌డం ద్వారా త‌న నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండే ఆయ‌న తాజాగా ఆద‌ర్శ వివాహాలు జ‌రిపించారు. ఉచితంగా ఒక్క‌ జంటకు వివాహం చేయడానికే నానా ఇబ్బందులు పడుతున్న ప్ర‌స్తుత రోజుల్లో పెద్ద సంఖ్య‌లో సామూహిక వివాహాలు జరిపించారు. ఆద‌ర్శ రీతిలో వివాహాలు జ‌రిపించ‌డ‌మే కాకుండా...బంధువులకు భోజనాలు పెట్టారు. సాధారణంగా ఇంట్లో పెళ్లికి ఎలాంటి తంతు జరిపిస్తారో.. అదే రీతిలో, వేద పండితుల మంత్రోచ్చరణలు, భాజాబజంత్రీల నడుమ ముచ్చటగా కళ్యాణ వేడుకను నిర్వహించారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప-రమాదేవి దంపతుల చేతుల మీదుగా.. 116 ఆదివాసీ జంటలు ఒక్కటయ్యాయి. 

 

సిర్పూర్ నియోజ‌క‌వ‌ర్గంలోని బెజ్జుర్ మండలం సోమిని గ్రామ శివారులో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప త‌న ఆధ్వర్యంలో నిరుపేద జంటలకు సామూహిక వివాహాలు నిర్వహించారు. ఎమ్మెల్యే దంపతులు నూతన జంటలకు తాళి బొట్టు అందించి ఆశీర్వదించారు. పండితులు పెట్టిన ముహూర్తానికి తాళిబొట్లు కట్టి 116 జంటలు ఒక్కటయ్యాయి. అనంతరం వచ్చిన కుటుంబాలకు భోజన సదుపాయం కల్పించారు. నూతన దంపతులకు బీరువా, పరుపులు, వ‌స్తువులు ఎమ్మెల్యే కానుకగా అందించారు. ఈ వేడుకకు హాజరైన మాజీ ఎంపీ గోడం నగేష్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, జిల్లా జడ్పీ ఛైర్మన్ కోవ లక్ష్మీ.. నూతన దంపతులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప 116 ఆదివాసీ జంటలకు వివాహాలు జరిపించ‌డం అభినంద‌నీయ‌మ‌ని ప్ర‌జాప్ర‌తినిధులులు ప్ర‌శంసించారు. ఎంద‌రికో ఆయ‌న ఆద‌ర్శంగా నిలిచార‌ని పేర్కొన్నారు. 

 


ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ… ఎమ్మెల్యే కోనప్ప చేతుల మీదుగా నిరుపేద జంటలకు వివాహాలు జరిపించడం అభినంద‌నీయ‌మ‌న్నారు. ప్రతీయేటా ఇలా సామూహిక వివాహాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కుటుంబం ఎంద‌రికో స్ఫూర్తిగా నిలిచింద‌ని అన్నారు. వారికి, వారి కుటుంబానికి ఎంతో రుణపడి ఉంటామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: