వైసీపీ సర్కారుపై తెలుగుదేశం నేతలు చేస్తున్న విమర్శలపై వైసీపీ మంత్రి కన్నబాబు తీవ్రంగా విరుచుకుపడ్డారు. జగన్ , మోడీ ఏకాంతంగా మాట్లాడుకున్నవి చంద్రబాబు, యనమల రామకృష్ణుడుకు ఎలా తెలిశాయంటూ విమర్శించారు. కొంపదీసి.. వీరు ప్రధాని ఆఫీస్‌లో స్పై కెమెరాలు పెట్టారా..? లేక నరేంద్ర మోడీ యనమల, చంద్రబాబుకు ఫోన్‌ చేసి చెప్పారా..? అని ప్రశ్నించారు.



మంత్రి కన్నబాబు ఇంకా ఏమన్నారంటే.. “ పిచ్చి ప్రేలాపణలు, వృథా ప్రయాసగా వారు పడుతున్న తీరు చూస్తే నవ్వాలో.. జాలి పడాలో అర్థం కావడం లేదు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి సుదీర్ఘంగా కలిసి మాట్లాడుకుంటే మీకెందుకు కడుపు రగిలిపోతుంది. అంటే ఈ రాష్ట్రం బాగుపడకూడదా..? కేంద్రానికి, రాష్ట్రానికి సంబంధాలు మెరుగుపడకూడదని భావిస్తున్నట్లుగా అర్థం అవుతుంది... అన్నారు మంత్రి కన్నబాబు.



" ప్రజలు ఎనిమిది నెలల క్రితమే 23 స్థానాలకు పడగొట్టి.. బాబూ నీ స్థానం ఇదే అని తీర్పు ఇచ్చారు. ప్రజా తీర్పును కూడా గౌరవించకుండా కృత్రిమ ఉద్యమాలు సృష్టించడం, జోలె పట్టడం.. చేతుల్లో పచ్చమీడియా ఉందని ఏది పడితే అది మాట్లాడటం చేస్తున్నారు. ఎనిమిది నెలల పరిపాలనలోనే ఏదో తలకిందులు అయినట్లుగా మాట్లాడుతున్నారు. న్యూయార్క్, వాషింగ్టన్‌ టైమ్స్‌లో ఏదో రాశారని మాట్లాడుతున్నారు.. అంటూ మండిపడ్డారు.



అంతే కాదు.. “ తప్పుడు సమాచారం ఇచ్చి జాతీయ పత్రికలు, అంతర్జాతీయ పత్రికల్లో రాతలు రాయించి వాటిని తీసుకొచ్చి ఇలా రాశాయని, మొత్తం నాశనం అవుతుందని సీఎం వైయస్‌ జగన్‌పై బురదజల్లుతున్నారని.. అధికారం లేకపోతే గంటకూడా గడపలేని స్థితికి దిగజారిపోయారని కన్నబాబు విమర్శించారు.



దావోస్‌ వెళ్లకపోతే అక్కడున్న పారిశ్రామిక వేత్తలు అంతా కలిసి కూర్చొని ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టకూడదని అనుకున్నారని కట్టుకథలు వినిపిస్తున్నారు.. ప్రతి సంవత్సరం కోట్లు పెట్టి ఇన్విటేషన్‌ కొనుగోలు చేసి బిల్డప్‌ ఇచ్చి అక్కడ స్టాల్‌ పెట్టి వెళ్లే వాళ్లను పిలిచి భోజనం, టిఫిన్లు పెట్టి చంద్రబాబు ఒక డ్రామా కంపెనీ నడిపారని కన్నబాబు ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: