మాజీ సీఎం చంద్రబాబు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నారా.. అధికారం కోల్పోయిన ఆయన్ను ఇప్పుడు వరుసగా కష్టాలు చుట్టుముడుతున్నాయా.. ఇటీవల వరుసగా టీడీపీ నేతలు, చంద్రబాబు మాజీ పీఎస్ పై జరిగిన ఐటీ దాడులు ఆయన అక్రమాలకు సాక్ష్యాధారాలు సంపాదించి పెట్టాయా.. ఇప్పడు రాజకీయ వర్గాల్లో ఈ అనుమానాలు కలుగుతున్నాయి.



స్వయంగా చంద్రబాబుకు పర్సనల్ సెక్రటరీగా పని చేసిన శ్రీనివాస్ చౌదరి సహా ఆయా వ్యక్తులు, సంస్థల మీద జరిపిన దాడులలో రెండు వేల కోట్ల రూపాయలకు పైగా చేతులు మారినట్లు ఆదాయపన్నుశాఖ ప్రకటించడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ మేరకు ఆదాయపన్ను శాఖ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం... ఫిబ్రవరి 6 నుంచి హైదరాబాద్‌, విజయవాడ, కడప, విశాఖపట్నంతో పాటు పుణెలోనూ ఐటీ అధికారులు సోదాలు నలభై చోట్ల సోదాలు జరిగాయి.



బోగస్ బిల్లులు, అధిక రేట్లపై ఇన్వాయిస్‌ల ద్వారా అక్రమాలకు పాల్పడ్డట్లు గుర్తించిన ఐటీ శాఖ... ప్రాథమిక అంచనాల ప్రకారం రూ 2,000 కోట్లు చేతులు మారినట్టు భావిస్తోంది. దాడుల్లో భాగంగా పలు కీలక పత్రాలు, ఖాళీ బిల్లులు, - మెయిల్స్‌, వాట్సాప్‌ మెసేజ్‌ల ద్వారా జరిపిన లావాదేవీలతో పాటు విదేశీ లావాదేవీల వివరాలను సైతం గుర్తించినట్లు తెలిపింది.



ఒక ప్రముఖ వ్యక్తి మాజీ వ్యక్తిగత కార్యదర్శి ఇంటిపై జరిపిన దాడులతో ఈ భారీ రాకెట్ బయటపడినట్లు ఆదాయపు పన్ను శాఖ తన ప్రకటనలో పేర్కొంది. ఇటీవలే చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ నివాసంపై సోదాలు జరగడంతో ఆదాయపు పన్ను శాఖ ప్రకటించిన ప్రముఖ వ్యక్తి చంద్రబాబేనని.. ఆ మాజీ కార్యదర్శి శ్రీనివాసేనని భావిస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: