ప్రతి మనిషి జననంతో లోకంలోకి అడుగుపెడితే, మరణంతో లోకాన్ని వీడి వెళ్లుతాడు.. ఒక జనం సుప్రభాతమైతే, ఒక మరణం సంధ్యారాగం. ఈ జీవన సమరంలో ఎన్ని ఉన్నా లేకున్నా, ఈ రెండు మాత్రం మనిషిని ఎన్నటికి వీడవు... ఇకపోతే దేశాన్ని రక్షించేది సైనికుడు అయితే, ఆ సైనికున్ని రక్షించేది కూడా రైతే.. అలాంటి రైతు ఒకప్పుడు సస్యశ్యామలంగా వెలుగొందిన ఈ భారతదేశంలో రాజులా బ్రతికాడు.. కానీ ఇప్పుడు అనాధగా మారుతున్నాడు.. ఇందుకు కారణం ఒకనాటి వైభవోపేతమైన ఫలసాయం వైపు రైతులను నడిపించడానికి మంచి వ్యవస్ద ఉండేది. కానీ నేటికాలంలో రైతులను రాయిల్లా మారుస్తున్న వ్యవస్ద రాజ్యమేలుతుంది.

 

 

రైతుల పట్ల పాలకుల చూపు మాటల వరకే ఆగిపోతుంది.. దీనివల్ల రైతు నానాటికి పేదవాడిగా మిగులుతున్నాడే గానీ కనీసం పది మందికి అన్నం పెడుతున్న ఫలం కూడా తనకు దక్కడం లేదు. ఈ దేశంలో సామాన్య జనం లేకున్న నష్టం లేదు. కానీ దేశ సరిహద్దులో సైనికుడు, గ్రామ సరిహద్దులో రైతు వీరిద్దరు లేకుంటే అసలు మనిషి మనుగడకు చిరునామ మిగలదు.. మనిషిగా బ్రతుకు సాగడం కష్టం.. ఇకపోతే ఒక రైతు అప్పుల బాధకు తనకు తానుగా బలవన్మరణానికి పాల్పడ్డాడు.. అతనికి వ్యవసాయం కలసిరాలేదు. బోర్లు వేస్తే చుక్కనీళ్లైతే రాలేదు కానీ లక్షల అప్పులు మాత్రం మిగులుతున్నాయి, వాటి వడ్డీలు మాత్రం కుప్పలుగా పెరిగిపోతున్నాయి. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆ పేదరైతు కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషాద సంఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.

 

 

కృష్ణగిరి మండలం పోతుగల్లుకు చెందిన రాజ్‌కుమార్‌(35), తనకున్న ఐదెకరాల్లో సాగు చేయడంతో పాటు మగ్గం నేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. నీళ్లు పడతాయేమోనన్న ఆశతో గతేడాది పొలంలో బోర్లు వేయించాడు. అతని ఆశ అడియాసలు అవగా, వరుణుడి మీద భారం వేసి ధైర్యంతో పత్తి సాగు చేశాడు. అయినా విధి చిన్న చూపు చూసింది. అందులోనూ నష్టాలే, ఈ పరిస్దితుల్లో మానసికంగా  కుంగిపోయాడు. అప్పటికే అప్పులు రూ.7 లక్షలకు పెరిగిపోయాయి. తీర్చే దారి కనిపించకపోవడంతో, ఓ రోజు బయటకు వెళ్లుతున్నానని చెప్పి వెళ్లిన ఆ రైతు, భార్యకు ఫోన్ చేసి పిడుగులాంటి వార్త చెప్పాడు.

 

 

‘అప్పులు తీరే దారి కనిపించడం లేదు. నేను వెల్దుర్తిలో రైలు పట్టాలపై ఉన్నా... చనిపోతున్నా శ్రీదేవి’ అని చెప్పడంతో భార్య హతాశురాలైంది.. ఈ విషయం విన్న అతని భార్య ఎంత నచ్చచెప్పిన వినకుండా తన ఫోన్ కట్ చేసాడు. ఇక వెంటనే తేరుకున్న అతని భార్య వెల్దుర్తిలోని తమ బంధువులు.. పోలీసులకు సమాచారం అందించడంతో రాజ్‌కుమార్ ను బ్రతికించుకుందాం అని బయలు దేరిన వారి కళ్లకు వెల్దుర్తి రైల్వే ట్రాక్‌పై విగత జీవిగా పడి ఉన్న అతని  మృతదేహాం కనిపించింది. ఇలా  ఒక యువరైతు అప్పుల భాధతో ఆత్మహత్యకు పాల్పడడం తీవ్రంగా కలచివేస్తుంది. రైతును బ్రతికిస్తే దేశం బాగుపడుతుంది అని జగమెరిగిన సత్యాన్ని పాలకులు ఎందుకు విస్మరిస్తున్నారో అర్ధం కావడం లేదు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: