ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు మళ్లీ ఢిల్లీకి వెళుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం విమానశ్రయం నుండి జగన్ బయలుదేరనున్నారు. రెండు రోజుల క్రితం ప్రధాని మోదీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను వివరించిన సీఎం జగన్ తాజాగా మరోసారి ఢిల్లీకి వెళ్లి ఈరోజు సాయంత్రం కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. సీఎం జగన్ ప్రధానంగా మూడు రాజధానుల ఏర్పాటు గురించి, శాసనమండలి రద్దు గురించి చర్చించనున్నట్టు తెలుస్తోంది. 
 
ఈరోజు సీఎం జగన్ అమిత్ షాతో భేటీ కావడానికి మరో ముఖ్యమైన కారణం ఉందని కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ వైసీపీ పార్టీని ఎన్‌డీఏలో చేర్చేందుకు సిద్ధమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్‌డీఏలో వైసీపీ చేరిక అనంతరం వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి కేంద్రమంత్రి పదవి కూడా దక్కనుందని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. 
 
సీఎం జగన్ రెండు రోజుల క్రితం ప్రధానిని కలిసిన సమయంలో పోలవరం, ప్రత్యేక హోదా అంశాలతో కూడిన పత్రాన్ని మోదీకి సమర్పించారు. శాసన మండలిని రద్దు చేయడానికి గల కారణాలను కూడా జగన్ మోదీకి వివరించారు. ప్రధాని మోదీ అమిత్ షాతో మాట్లాడాలని సూచించటంతో అమిత్ షా ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు కలవాలని జగన్ కు అపాయింట్మెంట్ ఇచ్చారు. 
 
మొదట సీఎం జగన్ గురువారం ఢిల్లీలోనే ఉండి అమిత్ షాను కలుస్తారని ప్రచారం జరిగింది. ఏపీ రాజకీయ వర్గాలలో అమిత్ షాతో జగన్ భేటీ గురించి చర్చ జరుగుతోంది. సీఎం జగన్ బీజేపీ అగ్ర నేతలతో సమావేశమవుతూ ఉండటంతో కేంద్రం సీఎం జగన్ తీసుకున్న పలు నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు సీఎం జగన్ వరుస పర్యటనలపై తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఈరోజ్ జగన్ వెంట విజయసాయిరెడ్డి, ఇద్దరు మంత్రులు ఢిల్లీని వెళ్తారని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: