జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో రక్తపుటేరులు పారి నేటికి సరిగ్గా ఏడాది. 40మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న ఘటన యావత్ దేశాన్ని కలవరపరిచింది. ఆ తర్వాత  జైషే మహ్మద్ కమాండర్‌తో పాటు మరో ఉగ్రవాదిని..భారత భద్రతాదళాలు మట్టుబెట్టి ప్రతీకారం తీర్చుకున్నాయి. కానీ అదే సమయంలో ఎదురుకాల్పుల్లో మన ఆర్మీ మేజర్ సహా ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మరువకముందే, మరోసారి పుల్వామా లాంటి దాడులకు ఉగ్రమూకలు కుట్రపన్నాయన్న ఇంటెలిజెన్స్ నివేదిక కలకలం రేపుతోంది. 

 

ఫిబ్రవరి 14, 2019. అదో చీకటి రోజు. జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రమూకలు దాడులకు తెగబడ్డ రోజు. ఈ ఘటనలో 40 మంది జవాన్లు నేలకొరిగారు. ఆ తర్వాత పుల్వామా దాడికి ప్రధాన సూత్రదారుడు జైషే సంస్థ కమాండర్‌ను మట్టుబెట్టి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. రషీద్‌ ఘాజీతో పాటు మరో ఉగ్రవాది కమ్రాన్‌ను భద్రతా దళాలు అంతమొందించాయి. పుల్వామా జిల్లాలోని పింగ్లాన్‌ వద్ద ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ...వీరు ఆర్మీకి చేతికి చిక్కడంతో మట్టుపెట్టారు. అయితే ఈ కాల్పుల్లో మన ఆర్మీ మేజర్‌ సహా ముగ్గురు జవాన్లు, ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయారు.

 

అదే రీతిలో మరో దాడికి ఉగ్రవాదులు పథక రచన చేసినట్టు కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగానికి సమాచారం అందింది. పాకిస్థాన్ బాలాకోట్‌లో భారత వైమానిక దాడులకు ప్రతీకారంగా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. బాలాకోట్‌లోని ఉగ్రవాద శిభిరంలో శిక్షణ పొందిన 27 మంది పాక్ ప్రేరేపిత జైషే మహ్మద్ ఉగ్రవాదులు దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. వెంటనే అధికారులు కేంద్రాన్ని అలర్ట్ చేశారు. 

 

తొలుత నియంత్రణ రేఖ వద్ద కాల్పులకు దిగాలని, దానిని భారత జవాన్లు తిప్పికొట్టే ప్రయత్నంలో ఉండగా.... ఉగ్రవాదులను మన భూభాగంలోకి పంపేలా ప్లాన్ చేసినట్టు ఇంటెలిజెన్స్‌కు సమాచారం అందింది. బాలాకోట్‌లో ఉగ్రవాదులకు మసూద్ అజర్ కుమారుడు యూసుఫ్ అజర్ శిక్షణ ఇచ్చినట్టు నిఘా వర్గాలు తెలిపాయి. తనిఖీలు చేపడుతూ.. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు అధికారులు.

  

మరింత సమాచారం తెలుసుకోండి: