జనసేన పార్టీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అయ్యో పాపం ! అని అందరి మనసుల్లోనూ ఉంది. రాజకీయంగా పవన్ కు కలిసి రావడం లేదనే విషయాన్ని జనాలు చర్చించుకుంటున్నారు. ఇక పవన్ రాజకీయ అడుగులు కూడా ఆ విధంగా తప్పులతడకగా ఉండడంతో ఆయనపై సానుభూతి ఉన్నా ప్రయోజనమే కనిపించడంలేదు. గతంలో పవన్ అన్న చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నించినా అది పెద్ద సక్సెస్ అవ్వలేదు. తరువాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో కనుమరుగై పోవడంతో చిరంజీవి దాదాపుగా రాజకీయాలకు దూరం దూరం గానే జరుగుతూ వచ్చారు. కానీ పవన్ జనసేన పార్టీ పెట్టిన తర్వాత తనకు ఆ పరిస్థితి రాకూడదని ఉద్దేశంతో దూకుడుగా ముందుకు వెళ్ళినా ఆశించిన స్థాయిలో ప్రయోజనం కనిపించలేదు. 


జనసేన పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొదటిసారిగా ఎన్నికలకు వెళితే కేవలం ఒకే ఒక్క సీటు దక్కడంతో పాటు తాను రెండు చోట్ల ఓటమి చెందడాన్ని పవన్ జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నా పెద్ద ఉపయోగం లేకుండా పోవడం, రాజకీయంగా తమకు ఇబ్బందులు సృష్టించే విధంగా బిజెపి వ్యవహరిస్తూ ఉండడడంతో పవన్ చాలా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. తాను కూడా గెలిచి సిఎం పీఠంపై కూర్చోవడమే లక్ష్యంగా పవన్ ఇప్పటి నుంచే పనిచేసుకుంటూ వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు.


 దీని కోసం పవన్ తన అన్న చిరంజీవి ఫార్ములాను ఉపయోగించుకునేందుకు సిద్దం అవుతున్నారు. 2009 ఎన్నికల్లో చిరంజీవి పాలకొల్లు, తిరుపతి నియోజకవర్గంలో పోటీ చేశారు. సొంత ప్రాంతమైన పాలకొల్లులో ఓటమి చెందినా  తిరుపతి ప్రజలు మాత్రం చిరంజీవిని గెలిపించారు. తిరుపతిలో చిరు సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉండటంతో గెలుపు సులువు అయ్యింది అనే మాట అప్పట్లో వినిపించింది. ఇక పవన్ కూడా ఆ విధంగానే వచ్చే ఎన్నికల నాటికి తిరుపతి లో పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. 


ఈ మేరకు ఇప్పటి నుంచి తిరుపతిలో జనసేన పార్టీ హవా పెరిగే విధంగా అనేక కార్యక్రమాలు రూపొందించుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో బిజెపి విషయంలో స్పష్టమైన క్లారిటీ తెచ్చుకుని రాజకీయంగా సక్సెస్ అవ్వాలని పవన్ ఆలోచనగా ఉన్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: