సొంత పార్టీపై విమ‌ర్శ‌లు, ప్ర‌త్య‌ర్థి పార్టీపై పార్టీపై ప్ర‌శంస‌ల‌తో స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేకెత్తిస్తున్న కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాజాగా ఇంకో ట్విస్ట్ ఇచ్చారు. అధికార‌ టీఆర్ఎస్ పట్ల సానుకూల వ్యాఖ్య‌లు చేస్తూ....ముఖ్య‌మంత్రి కేసీఆర్ మేన‌ల్లుడు హ‌రీశ్‌రావుపై మాత్రం విరుచుకుప‌డుతున్న ఆయ‌న తాజాగా అదే త‌ర‌హాలో పార్టీ నేత‌ల‌కు ఊహించ‌ని షాక్ ఇచ్చారు. కీల‌క‌మైన పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో తాను ఉన్నాన‌ని చెప్ప‌డంతో పాటుగా మ‌రిన్ని కామెంట్లు చేశారు. 

 


గ‌త ఏడాది జ‌గ్గారెడ్డి ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలిచారు. ఢిల్లీ రాజ్యం న‌డుస్తోంద‌ని, పార్టీలో కొంద‌రిదే పెత్త‌న‌మ‌ని వ్యాఖ్యానించ‌డం ద్వారా కాంగ్రెస్ నేత‌ల‌కు షాకిచ్చారు.  దానికి కొన‌సాగింపుగా...కేసీఆర్‌కు గుడి క‌ట్టిస్తాన‌ని ప్ర‌క‌టించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో త‌న‌కు విబేధాలు లేవ‌ని...తాను విభేదించేదంతా హరీశ్‌రావుతోనేనని, తనను జైల్లో పెట్టించింది ఆయనేనని ఆరోపించారు. ఉనికి కోసం హరీశ్‌ తనను బలి చేసే యత్నం చేశారని దుయ్యబట్టారు. హరీశ్‌తో పోలిస్తే కేటీఆర్‌ చాలా ఫెయిర్‌ అని వ్యాఖ్యానించారు. హరీశ్‌ ఇప్పుడు టీఆర్‌ఎస్‌ను వీడతారని తాను అనుకోవడం లేదన్నారు. ఇలా సానుకూల వ్యాఖ్య‌లు చేసిన జ‌గ్గారెడ్డి త్వ‌ర‌లో టీఆర్ఎస్‌లో చేర‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. అయితే అది ఆగిపోయింది.

 


తాజాగా కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పీసీసీ రేసులో భాగంగా తాను సీరియస్‌గానే ప్ర‌య‌త్నిస్తున్నాన‌ని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓ ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. `` పీసీసీ ఇంచార్జీ ఆర్‌సీ కుంతియాను కలిసి కు పీసీసీ అవకాశం ఇవ్వండి అని కోరాను. శివరాత్రి తర్వాత ఢిల్లీకి వెళ్లి సోనియాగాంధీ, రాహుల్ గాంధీని కలుస్తాను` అని ప్ర‌క‌టించారు. భావోద్వేగ రాజకీయాలు ఇప్పుడు పని చేయవని జ‌గ్గారెడ్డి విశ్లేషించారు. ``ప్రజల నాడీ ని పట్టి పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పుడున్న రాజకీయాలు పరిస్థితిలో ..డబ్బులు, అభివృద్ధి కోణంలోనే రాజకీయ వ్యూహం చేయాలి. కాంగ్రెస్‌లో  సీనియర్లు, జూనియర్లు కలిసి పనిచేస్తేనే అధికారంలోకి రాగలుగుతుంది. కాంగ్రెస్...లౌక్యం తో రాజకీయాలు చేయాలి `` అంటూ అప్పుడే హిత‌బోధ చేసేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: