మానవ సేవే మాధవ సేవ అన్నారు. తోటివాడికి సాయం చేయడానికి మించిన సంతోషం లేదు. ఈ సాయ పడే గుణం చిన్నప్పుడే పిల్లలకు అలవాటు చేయాలి. ఈ దిశగా హైదరాబాద్‌ బాచుపల్లిలోని సిల్వర్‌ ఓక్స్‌ అంతర్జాతీయ పాఠశాలలో చేస్తున్న ఓ వినూత్న ప్రయత్నం అందరికీ స్ఫూర్తినిస్తోంది. ఇక్కడ దాదాపు 3000 మంది పిల్లల వరకూ చదువుతుంటారు. ఈ స్కూలు పిల్లలు కొన్నేళ్లుగా ఇతరులకు సాయపడేందుకు పోగేసిన సొమ్మెంతో తెలుసా.. అక్షరాలా కోటిన్నర రూపాయలు.

 

ఇలాంటి దాన కార్యక్రమాలు చాలా చూసి ఉంటారు. కానీ ఇది చాలా ప్రత్యేకం ఎందుకంటే.. ఈ స్కూలు పిల్లలు డబ్బు కోసం తల్లిదండ్రులను అడగరు. వేరే ఎవ్వరినీ అడగరు. మరి ఎలా అంటారా.. వారి ఖర్చులు తగ్గించుకుంటారు. విలాసాలు మానుకుంటారు. పొదుపు నేర్చుకుంటారు. అలా పొదుపు చేసిన సొమ్మునే స్కూలుకు అందిస్తారు. ఇందుకోసం ఏటా విద్యాసంవత్సరం మొదలవ్వగానే మూడువేల మంది విద్యార్థులకు కిడ్డీబ్యాంకులు అందజేస్తారు.

 

పిల్లలు వాటిని ఇంటికి తీసుకెళతారు. అందులో నగదు జమ చేయడానికి విద్యార్థులు ఎవరినీ అడగకూడదనేది నిబంధన. పుట్టిన రోజు సరదాలు వంటి వేడుకల్లో పెట్టే ఖర్చులో కాస్త తగ్గించుకుంటారు. పాకెట్‌ మనీ, బహుమతుల ద్వారా అందిన డబ్బులు అందులో జమ చేస్తారు. ఒక్కో విద్యార్థి తమ పరిస్థితుల్ని బట్టి పొదుపు చేస్తుంటారు. మళ్లీ కిడ్డీ బ్యాంకులను జనవరి 26న పాఠశాలకు అప్పగించాలి.

 

ఈ పాఠశాలలో పిల్లలే కాదు.. ఉపాధ్యాయులూ ఇదే పని చేస్తారు. వారు చేసిన ఆదా గురించి స్కూల్లో చర్చిస్తారు. రోజూ అసెంబ్లీలో విద్యార్థులు చేసిన పొదుపు, వాళ్ల ఆలోచనల గురించి కొంతసేపు మాట్లాడతారు. పొదుపు చేసిన డబ్బుతో ఎంతమందికి సాయం అందుతోందో చెబుతారు. అంతే కాదు.. సాయం పొందిన వారిని తీసుకొచ్చి మాట్లాడిస్తారు. ఇవన్నీ పిల్లలకు తెలియకుండానే జీవిత పాఠాలవుతాయి. చాలా బావుంది కదూ.

మరింత సమాచారం తెలుసుకోండి: