తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇదివరకు ఉన్న జోష్ ఇప్పుడు బీజేపీలో కనిపించడం లేదు.. ఇదివరకు కేంద్రంలో ఉన్న ఈ అధికార పార్టీ తెలంగాణాలో పాగా వేయాలని ఎన్నో ఎత్తులు వేసింది. ఇందులో భాగంగా పార్లమెంట్ ఎన్నిక‌ల‌కు ముందు వివిధ పార్టీల నుండి బ‌డా నేత‌లు బీజేపీలోకి చేరారు. ఇందులో డీకే అరుణ‌, పొంగులేటి, జిత్తేంద‌ర్ రెడ్డి, వివేక్ , సోమార‌పు స‌త్య‌నారాయ‌ణ వంటి నేత‌లు ఉన్నారు..

 

 

ఈ దశలో మంచి ఊపుమీదున్న తమ పార్టీ వైపు, మరికొందరు నాయకులు చూస్తున్నారని, త్వరలోనే వారు కూడా తమ పార్టీ సభ్యత్వం తీసుకునే ఆలోచనలో ఉన్నారని, ఇప్పుడు కనిపించేది అంతా కేవ‌లం ట్రైల‌ర్లే అని అసలు సినిమా ముందు ముందు ఉంటుంద‌ని గాల్లో మేడలు కట్టారు.. అయితే వందరోజులు ఆడవలసిన సినిమా ఒక్కరోజు కూడ ఆడలేదు. ఎందుకంటే తెలంగాణ‌లో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ఫ‌లితాలు కాస్త అనుకూలంగా రావ‌డంతో రిటైర్డ్ ఐఏఎస్ చంద్ర‌ వ‌ద‌న్, మాజీ ముఖ్య‌మంత్రి నాదెండ్ల భాస్క‌ర్ రావు, గ‌రిక పాటి, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే అన్న‌పూర్ణ‌మ్మ‌, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మోత్కుప‌ల్లి న‌ర్సింహులు వంటి నేత‌లు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు...

 

 

వీరంతా పార్టీలో చేర‌డంతో బీజేపీ బల‌ప‌డుతుంద‌ని చంకలు గుద్దుకున్న కమళంకు మునిసిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాలు షాకివ్వడంతో గట్టి దెబ్బే తగిలింది.. ఇచ్చిన మాటప్రకారం అన్ని వార్డుల్లో అభ్యర్దుల‌ను నిల‌బెడ‌తామ‌ని చెప్పి పోటీకి సిద్దం కాలేకపోయారు. ఇదే కాకుండా దాదాపు వెయ్యికి పైగా స్థానాల్లో అభ్యర్దులు దొర‌క‌ని ప‌రిస్థితి ఏర్పడగా, కేవ‌లం 299 స్థానాల్లో మాత్ర‌మే గెలుపొందింది.

 

 

దీంతో రాష్ట్రంలో బీజేపీ గాలిబుడగలా తేలిపోయింది.. ఇక ప్రస్తుత పరిస్దితుల్లో బీజేపీలో చేరేందుకు నాయ‌కులెవ‌రూ ముందుకు రావ‌డం లేదు. ఇన్నాళ్లు కారుకు బ్రేకులు వేసేది మేమే అని ప్రచారం చేసుకున్న కమళం తెలంగాణాలో వాడిపోయే దశలో ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇలాంటి దశలో బీజేపీని నిండా గులాభి ముంచిందా అని అనుకుంటున్నారట. మరి ఇక్కడ పరిస్దితిని చక్కదిద్దేందుకు రంగంలోకి దిగే కట్టప్ప ఎవరో అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: