గత కొన్నిరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఐటీ దాడులు ప్రత్యేకంగా చంద్రబాబు మాజీ పి‌ఎస్ శ్రీనివాస్ చౌదరీ, కడప టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డిలకు సంబంధించిన ఇల్లు, ఆఫీసులపై రైడ్లు జరిగాయనే వార్తలు అందరిలో ఉత్కంఠ రేపాయి. పైగా రూ. 2 వేల కోట్ల వరకు అవినీతి సొమ్ము దొరికిందనే వార్తలు రావడంతో మరింత ఆసక్తి పెరిగింది.

 

అయితే ఈ 2 వేల కోట్ల అవినీతి సొమ్ము అనే విషయం వైసీపీ నేతలకు బాగా కలిసొచ్చింది. ఉన్నపళంగా బాబుని టార్గెట్ చేసేసి ఓ రేంజ్‌లో విమర్శలు చేసేశారు. అసలు వారు బాబుని విమర్శించడానికి ముందుకు రావడానికి చూస్తే ముచ్చటేసిందనే చెప్పొచ్చు. ఎందుకంటే గత ఐదేళ్లు బాబు అవినీతికి పాల్పడ్డారని వైసీపీ నేతలు ఎప్పటి నుంచో విమర్శలు చేస్తూ వస్తున్నారు గానీ.. ఎప్పుడు దానికి సంబంధించిన నిజనిజాలు అయితే తేలలేదు. కానీ తాజాగా ఐటీ దాడులు వైసీపీ నేతలకు ఆనందాన్ని ఇచ్చాయి.

 

2వేలు కోట్లు దొరికాయనేసరికి ఎప్పుడు బయటకు రాని వైసీపీ నేతలు బయటకొచ్చి బాబుని జైలుకు పంపాలని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ మంత్రులు దగ్గర నుంచి చూసుకుంటే ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలుతో సహ అందరూ ఒక్కసారిగా మీడియా ముందుకొచ్చి, బాబు బండారం బయటపడిందని ప్రకటనలు చేశారు. ఐటీ దాడుల కేసులో చంద్రబాబు నాయుడు, లోకేశ్ నాయుడును అరెస్ట్ చేయాలని, ఇప్పుడు ఎవరూ చంద్రబాబును కాపాడలేరని మాట్లాడారు.

 

ఇక వారి తాపత్రయం చూస్తుంటే బాబు ఎప్పుడెప్పుడు జైలుకు వెళతాడా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు అర్ధమవుతుంది. అయితే ఇప్పుడు వైసీపీ వాళ్ళు వాదిస్తున్నట్లుగా 2 వేల కోట్ల అక్రమాలు బాబుకు లింక్ అవుతాయా? ఈ ఐటీ దాడుల కేసులో బాబు జైలుకు వెళతాడా? అంటే ఏం చెప్పలేం. ఏదో వైసీపీ నేతలు ముచ్చట పడటం తప్ప, ఈ ఐటీ దాడుల వల్ల బాబుకు ఇప్పటికిప్పుడు పెనుప్రమాదం జరిగిపోతుందో? లేదో కూడా చెప్పలేం.

మరింత సమాచారం తెలుసుకోండి: