ఆంధ్ర ప్రదేశ్ లో త్వరలోనే జరగనున్న స్థానిక సంస్థల కు తెలుగుదేశం పార్టీ సన్నద్ధమవుతోంది . మార్చి 15 లోగా   స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించే అవకాశాలుండడంతో , ఈ నెల 17  నుంచి 45 రోజులపాటు  జనచైతన్య యాత్రలను నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నాయకత్వం నిర్ణయించింది . నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామం మీదుగా జనచైతన్య యాత్ర కొనసాగేలా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలని తమ్ముళ్లకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు .   నియోజకవర్గ ఇంచార్జ్ , ఎమ్మెల్యే నేతృత్వం లో ఈ కార్యక్రమం చేపట్టాలని ఆయన ఆదేశించారు .

 

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో 45 రోజులపాటు జనచైతన్య యాత్ర చేపట్టడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదని , ఆర్ధికంగా ఎంతో ఖర్చుతో కూడుకున్నదని ...  ప్రస్తుత పరిస్థితుల్లో తామంతా వ్యయప్రయాసలు భరించలేమంటూ  తమ్ముళ్లు నేరుగా చంద్రబాబు ముందే వాపోయినట్లు తెలుస్తోంది . మార్చి 15 లోగా స్థానిక సంస్థలు నిర్వహించే అవకాశాలు ఉండడం తో జనచైతన్య యాత్రల పేరిట ప్రజల్లోకి వెళ్లడం ద్వారా, రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ స్థానాలు గెల్చుకోవాలని టీడీపీ అధిష్టానం భావిస్తుంటే , తమ్ముళ్లు మాత్రం 45 రోజుల పాటు జనచైతన్య యాత్రలకయ్యే ఖర్చు గురించి గుండెలు బాదుకుంటున్నారు .

 

ప్రస్తుతం తాము ఎంత ఖర్చు చేసిన వృధా ప్రయాసే అవుతుందని , స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలంగానే ప్రజలు తీర్పిచ్చే అవకాశముందని తమ్ముళ్లు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది . అందుకే 45 రోజుల పాటు జనచైతన్య యాత్రల పేరిట ఊళ్లు పట్టుకుని తిరగడం ఎందుకని , ఆ పేరు తో డబ్బు తగలేయడం దండగని భావించే తమ్ముళ్లు, జనచైతన్య యాత్ర కు తిరకాసు పెడుతున్నట్లు సమాచారం .  తమ్ముళ్లను బాబు ఎలా ఒప్పించి 45 రోజులపాటు జనచైతన్య యాత్రలు కొనసాగేలా చేస్తారో  చూడాలి మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: