సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కోసం మండలి చైర్మన్  పంపిన ఫైల్ ను మండలి కార్యదర్శి రెండవసారి కూడా  వెనక్కి తిప్పి  పంపడం చర్చనీయాంశంగా మారింది . ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించిన పరిపాలన వికేంద్రీకరణ , సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను  సెలెక్ట్ కమిటీ  కి పంపాలని మండలి చైర్మన్ షరీఫ్ తన విచక్షణ అధికారం మేరకు  నిర్ణయించిన విషయం తెల్సిందే .  ఇప్పటికే ఒకసారి సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కోసం  మండలి కార్యదర్శి కి చైర్మన్ ఫైల్ పంపగా , దాన్ని  ఆయన  వెనక్కి  తిప్పి పంపారు .

 

అయినా ,  రెండవసారి సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కోసం చైర్మన్ పంపిన  ఫైల్ ను ... నిబంధనలు అంగీకరించవని చెప్పి కార్యదర్శి  మళ్లీ వెనక్కి  తిప్పి పంపడం రాజకీయంగా  ప్రాధాన్యత సంతరించుకుంది .మండలి చైర్మన్ , కార్యదర్శి మధ్య కొనసాగుతున్న ఈ నిబంధలు యుద్ధం లో ...  అసలు నిబంధలు ఏమి చెబుతున్నాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది . చైర్మన్ చెప్పినట్లుగా కార్యదర్శి నడుచుకోవాలని  , లేనిపక్షం లో ఆయనపై సభ్యులు ఎవరైనా ధిక్కరణ నోటీసు ఇవ్వవచ్చునని మండలి విపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు . కార్యదర్శికి మండలి ధిక్కరణ నోటీసులు ఇవ్వాలని టీడీపీ నాయకత్వం యోచిస్తోంది .

 

 పార్టీ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తామని  పేర్కొనడం ద్వారా నోటీసులు ఇవ్వనున్నట్లు రామకృష్ణుడు  చెప్పకనే చెప్పారు . సెలెక్ట్ కమిటీ వ్యవహారం పై న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది . అయితే   గడువు లోగా సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కాకపోవడం తో , పరిపాలన వికేంద్రీకరణ , సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులు మండలి  ఆమోదం పొందినట్లేనని అధికార పార్టీ నేతలు , అమాత్యులు వాదిస్తున్నారు .   

మరింత సమాచారం తెలుసుకోండి: